Income Taxes: ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేయాలని భావిస్తున్న కేంద్రం. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉన్నవారికి పన్ను 10 శాతానికి తగ్గింపు?
File image of Union Finance Minister Nirmala Sitharaman.

New Delhi, August 28: ఆర్థిక మందగమనం నేపథ్యంలో పౌరులపై విధించే ఆదాయపు పన్నును (Income Tax)  తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.

ప్రస్తుతం రూ.  2.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవారికి 5% పన్ను  మాత్రం ఉంది.  ఇకపోతే,  ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయం ఏడాదికి రూ .5 లక్షల నుంచి రూ .10 లక్షల మధ్య ఉన్నవారు 20% పన్ను, అలాగే రూ .10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30 % పన్ను చెల్లిస్తున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీరికి 10% శాతం పన్ను తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

బుధవారం బయటకు వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌లలో సమూల మార్పులను సూచిస్తూ ప్రత్యక్ష పన్నుల టాస్క్‌ఫోర్స్ (TFTD) కొన్ని ప్రతిపాదనలు చేసింది.  ఈ  సిఫారసులకు కేంద్ర కేబినేట్ ఆమోదం లభిస్తే

సంవత్సరానికి రూ .5 లక్షల నుండి 10 లక్షల మధ్య సంపాదించే ప్రజలు 10 శాతం ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే సంవత్సరానికి రూ .10 నుంచి 20 లక్షల మధ్య సంపాదించేవారికి వ్యక్తిగత ఆదాయపు పన్నును 20 శాతానికి తగ్గించడం కూడా ఈ ప్రతిపాదనల్లో ఉంది.  కాగా,  రూ .20 లక్షకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారిపై, ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు. వార్షిక ఆదాయం రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల స్లాబ్‌లో ఉన్నవారు  30 శాతం ఆదాయపన్నునే కట్టాల్సి ఉంటుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఆగస్టు 19 న తన నివేదికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు సమర్పించినప్పటికీ, ఆ వివరాలు ఇంకా బయటకు వెల్లడించలేదు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.