New Delhi, Feb 11: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది. ముఖ్యంగా వ్యక్తిగత వైద్యం మరింత ఎక్కువైంది. చిన్న తుమ్ము, దగ్గు వచ్చినా కలవరపడటం, కరోనా (Corona) సోకిందేమోనని అనుమానంతో టెస్టు చేయించుకోవడం సాధారణమై పోయింది. అయితే కరోనా టెస్టుల (Corona Test) కోసం ఆసుపత్రులకు వెళ్లాలంటే వైరస్ భయం ఎక్కువైంది. అందుకే ఈ మధ్య చాలా మంది సెల్ఫ్ టెస్ట్ కిట్‌లను (Using Covid Self-Test Kits ) ఉపయోగిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండి కరోనా టెస్టులు చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ కిట్‌లను (Covid Self-Test Kits) వాడటం తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. అప్పుడు అసలు ఫలితం రాదు. అందుకే.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను వాడేప్పుడు ఈ తప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వాడే విధానంపై ఆయా కిట్ల మీద రాసి ఉంటుంది. దాన్ని ఫా. మరి అవేంటో ఓ సారి చూద్దాం..!
1. తప్పుడు ఉష్ణోగ్రతలో భద్రపర్చడం
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌లను (Rapid Antigen test kit) 2-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితేనే అవి కచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. అంతేగానీ, అధిక ఉష్ణోగ్రతలు, లేదా ఫ్రిజ్‌లో భద్రపర్చకూడదు. అలా చేస్తే కిట్ భాగాలు పాడవుతాయి.
2. ఫ్రిజ్ నుంచి నేరుగా వద్దు
కిట్‌లోని పరికరాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో సరిగా పనిచేయవు. ఒకవేళ కిట్‌ను ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే.. దాన్ని బయటకు తీసిన వెంటనే పరీక్షకు ఉపయోగించకూడదు. కనీసం 30 నిమిషాల పాటు గది ఉష్ణోగ్రతలో ఉంచి ఆ తర్వాత టెస్టు చేసుకోవాలి.
3. తేదీలు సరిచూసుకోవాలి
టెస్టు కిట్‌లను ఎప్పటిలోగా ఉపయోగించాలన్న గడువు తేదీలను ప్యాకేజ్‌పై ముద్రిస్తారు. వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలి. గడువు తీరిన కిట్‌లతో పరీక్ష చేసుకోకూడదు.
4. ముందే వద్దు
టెస్టు కిట్‌లోని వస్తువులను ముందే తెరిచి పెట్టుకోకూడదు. పరీక్షకు మీరు సిద్ధమైన తర్వాతే వాటిని తెరవాలి. పరీక్ష కిట్‌ను ఎక్కువ సేపు తెరిచి ఉంచితే తప్పుడు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. (అంటే మీకు కొవిడ్ లేకపోయినా ఉన్నట్లు చూపిస్తుంది)
5. సరైన సమయంలోనే టెస్ట్
సాధారణంగా మనకు కరోనా సోకిన కనీసం రెండు రోజుల తర్వాత గానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు (antigen self test) వైరస్‌ను గుర్తించవు. అందుకే వెంటనే సెల్ఫ్ టెస్టు చేసుకోకూడదు. కనీసం మూడు రోజుల తర్వాత చేస్తే ఫలితం కరెక్ట్‌గా వస్తుంది. అయితే అతి ఆలస్యం కూడా పనిచేయదు. వైరస్ సోకిన ఏడు, ఎనిమిది రోజుల తర్వాత ర్యాపిడ్ టెస్టులు కరోనాను గుర్తించలేవు.
6. అన్ని పరీక్షలు ఒకటి కాదు
కొన్ని యాంటిజెన్ (antigen test)పరీక్షలకు నాసికా ద్రవం అవసరమైతే, మరికొన్నింటికి లాలాజలంతోనూ టెస్టు చేసుకోవచ్చు. అయితే అన్ని పరీక్షలు, అన్ని కిట్‌లు ఒకేలా ఉండవు. శాంపిల్ ఎలా తీసుకోవాలి.. ఎన్ని చుక్కలు వేయాలి.. ఎంతసేపట్లో ఫలితం వస్తుంది అనేది బ్రాండ్‌ను బట్టి మారొచ్చు. అందుకే టెస్టుకు ముందే దాని కవర్‌పై ఉన్న సూచనలను చదువుకోవాలి.
7. కలుషితం చేయొద్దు
ముక్కు రంద్రాల్లో పెట్టే నాజల్ స్వాబ్ టిప్(పైభాగాన్ని)ను చేతివేళ్లతో తాకకూడదు. కిట్ నుంచి బయటకు తీసిన తర్వాత కింద ఎక్కడా పెట్టకూడదు. అలా చేస్తే అది కలుషితం అయ్యి తప్పుడు ఫలితాలు రావొచ్చు.
8. స్వాబ్ ఇలా తీయాలి
నాజల్ స్వాబ్ (Swab) చేసుకునేముందు ముక్కును చీది శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంతసేపటికి స్వాబ్ శాంపిల్ తీయాలి. కొందరు నాజల్ స్వాబ్‌ను (Nasal Swab) నేరుగా ముక్కు పైభాగంలో లోపలికి వరకు తీసుకెళ్తారు. అలా కాకుండా స్వాబ్‌ను నెమ్మదిగా 2-3 సెంటీమీటర్ల వరకు నాసికా రంధ్రంలోకి తీసుకెళ్లి అప్పుడు టెస్టుకు అవసరమైనన్ని సార్లు గుండ్రంగా తిప్పాలి.
9. పరీక్షకు ముందు ఇవి వద్దు
లాలాజలంతో చేసే యాంటిజెన్ టెస్టుకు ముందు 30 నిమిషాల ముందు తినడం, తాగడం, బబుల్ గమ్ నమలడం, పొగ తాగడం, పళ్లు తోముకోవడం వంటివి చేయకూడదు.
10. టెస్టు కిట్‌లో(Test kit) ఎన్ని చుక్కలు వేయాలనేది కూడా ప్యాకెట్‌పై రాసి ఉంటుంది. దాన్నే అనుసరించాలి. తక్కువ లేదా ఎక్కువ చుక్కలు వేస్తే తప్పుడు ఫలితం వస్తుంది.
11. కిట్‌పై C, T అనే అక్షరాలతో రెండు లైన్లు ఉంటాయి. ఆ రెండు లైన్లపై చారలు కన్పిస్తే కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ C లైన్ వద్ద మాత్రమే చార కన్పిస్తే కొవిడ్ నెగెటివ్‌గా పరిగణించాలి. అలా కాకుండా T లైన్ వద్ద మాత్రమే చార కన్పించినా.. లేదా ఎలాంటి చారలు కన్పించకపోయినా మీరు సరిగా టెస్టు చేయలేదని అర్థం. మళ్లీ కొత్తగా టెస్టు చేసుకోవాల్సి ఉంటుంది.