New Delhi, Oct 3: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ఇంకా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) అందుబాటులోకి రాకపోవడంతో ఇది ప్రజలను మరింతగా భయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ రెండు రోజులకొకసారి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే టెస్టులు చేయించుకున్న తరువాత రిపోర్ట్ రావడానికి చాలా సమయం తీసుకుంటుండంతో కొంచెం ఆందోళనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని (Corona Rapid Test Update) అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (California Institute of Technology) విజయం సాధించింది.
రక్తం లేదా లాలాజలంలోని వైరస్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు చౌకగా లభించే సెన్సర్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు... ఈ పరికరాన్ని ఇంట్లో ఎవరికి వారే వాడి వైరస్ (coronavitus) ఉనికిని తెలుసుకోవచ్చు. గ్రాఫీన్ పొర సాయంతో గతంలోనే ఈ శాస్త్రవేత్తలు గౌట్ వంటి వ్యాధులను గుర్తించే పద్ధతిని అభివృద్ధి చేశారు. లేజర్ కిరణాల సాయంతో ప్లాస్టిక్ పొరపై అతి సూక్ష్మమైన కంతలను ఏర్పాటు చేయడం.. వీటిల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ సృష్టించే యాంటీబాడీలను జోడించడం ముఖ్యమైన అంశం.
ర్యాపిడ్ ఫ్లెక్స్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో యాంటీబాడీలతోపాటు కొన్ని ప్రొటీన్లు కూడా ఉంటాయి. తద్వారా వైరస్‌ను గుర్తించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ స్పందనను, వ్యాధి తీవ్రతను సూచించే మార్కర్లను కూడా గుర్తించవచ్చు. ఇలా ఏకకాలంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మూడు అంశాలను తెలుసుకోగలగడం.. చికిత్స విషయంలో చాలా కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వీ గావ్ తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ సంక్రమించిందో లేదో తెలుసుకోవడానికి సైంటిస్టులు కొన్ని సూచనలు తెలిపారు. పూర్తిగా వాసననుగానీ, రుచినిగానీ కోల్పోవడం కరోనా వైరస్ ఉందని చెప్పడానికి అత్యంత విశ్వసనీయ లక్షణమని, ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్ ఐసోలేషన్, పరీక్షలు, ఎవరెవరికి సోకిందో తెలుసుకోవడానికి ఈ లక్షణాలను ప్రధానాధారంగా చేసుకొని గుర్తించాల్సి ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవల వారు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా లండన్‌లోని ప్రైమరీ కేర్ సెంటర్స్‌లోని, 567 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించి, వారిలో 78 శాతం మంది అకస్మాత్తుగా వాసన, రుచిని కోల్పోయినట్లు గుర్తించారు. వీరిలో 40 శాతం మందికి జ్వరంల కానీ, దగ్గు గానీ లేవని తెలిపారు.