Washington, October 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్ ఆరంభిస్తున్నామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ (Donald Trump), మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్ జరుగుతుందని చెప్పారు.
ట్రంప్‌కి ప్రస్తుతం ప్రయోగాత్మక చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ దంపతులు బహిరంగంగా కనిపించలేదు. శుక్రవారం మాత్రం అధ్యక్షుడు మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి (Donald Trump Hospitalised For COVID-19 Treatment) వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. తాను ఆస్పత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా బాగానే ఉన్నారని ట్రంప్ తెలిపారు .
ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ మాస్క్ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం క్లీన్‌ల్యాండ్‌లో జరిగిన తొలి చర్య సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారు. దాంతో బైడెన్, ఆయన భార్య జిల్ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. తమకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అంతేకాక ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్ తెలిపారు.
వైట్‌హౌస్ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. హోప్‌కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు.