CSpace- Government OTT: భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే OTT ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ జరిగింది. 'CSpace' పేరుతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించి, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్చి 7, గురువారం నాడు తమ రాష్ట్ర స్వంత OTT ప్లాట్‌ఫారమ్ అయిన 'సి-స్పేస్' ను స్థానిక కైరలీ థియేటర్‌లో అధికారికంగా ప్రారంభించారు.
CSpace అనేది దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆధీనంలో నడిచే OTT ప్లాట్‌ఫారమ్ కావడం విశేషం. కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధ్వర్యంలో 'కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (KSFDC) ఈ ఓటీటీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.
కేరళ ప్రభుత్వం లాంచ్ చేసిన ఈ CSpace ప్లాట్‌ఫారమ్ ప్రజల కోసం రూపొందించినది. ప్రజలకు సమాచారంతో పాటు వినోదాత్మక కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. నేడు వివిధ ప్రైవేట్ ఓటీటీలలో విధ్వేషపూరితమైన, నేరపూరితమైన శృంగారపరమైన కంటెంట్ మితిమీరుతుంది. అందుకు భిన్నంగా CSpace ఓటీటీలో అర్థవంతమైన కంటెంట్ ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు మంచి విలువలు నేర్పడం, జ్ఞానాన్ని అందించడం కోసం ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
CSpace OTT ప్లాట్‌ఫారమ్ కోసం 60 మంది సభ్యులతో కూడిన క్యూరేటర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో బెన్యామిన్, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్ వంటి కళారంగ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్ ఓటీటీలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయాలో క్యూరేట్ చేస్తుంది. ఎంపిక చేసిన కంటెంట్ వీడియోలను కనీసం ముగ్గురు సభ్యులు రివ్యూ చేసి వాటిని ఆమోదించిన తర్వాతే అవి ప్రసారం చేయబడతాయి.
మొదటి దశలో భాగంగా క్యూరేటర్లు ఇప్పటికే 35 ఫీచర్ ఫిల్మ్‌లు, ఆరు డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్‌తో సహా మొత్తం 42 చిత్రాలను CSpaceలో ప్రసారం చేసేందుకు ఎంపిక చేశారు. జాతీయ లేదా రాష్ట్ర అవార్డులను గెలుచుకున్న చిత్రాలు, ప్రధాన చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన చలనచిత్రాలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తారు.
అయితే, ఇది ప్రభుత్వ అనుబంధంగా పనిచేసే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయినప్పటికీ, CSpaceలో సినిమాలు ఉచితంగా చూడటానికి అవకాశం లేదు. CSpace 'పే పర్ వ్యూ' మోడల్‌ను అవలంబిస్తుంది, ఒక్కో సినిమాకి వినియోగదారుల నుండి రూ. 75 వసూలు చేస్తుంది.