Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

Delhi November 04: దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కేంద్ర దిగివచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో, అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా సామాన్యుడికి స్వల్పంగా ఊరటనిస్తూ లీట‌ర్ పెట్రోల్‌పై రూ.5, లీట‌ర్ డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం త‌గ్గించిన మరునాడే ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాట‌లో ప్రయాణిస్తున్నాయి.

ఎక్సైజ్ సుంకానికి అనుగుణంగా వ్యాట్ పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు త‌గ్గించే ప‌నిలో ప‌డ్డాయి. ఆ జాబితాలో క‌ర్ణాట‌క‌, అసోం, గుజ‌రాత్‌, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర‌ప్రదేశ్‌, మ‌ణిపూర్‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాలు వ్యాట్ త‌గ్గించివేశాయి.

అసోంలో పెట్రోల్, డీజిల్ మీద రూ.7 వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  పెట్రోల్‌, డీజిల్‌ల‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించ‌డం నా గుండెను తాకింది. ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ నిర్ణయానికి అనుగుణంగా త‌క్షణం రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద రూ.7 వ్యాట్ త‌గ్గిస్తున్నాం అంటూ అసోం సీఎం హిమంత బిశ్వశ‌ర్మ ట్వీట్ చేశారు.

 

గోవా ప్రభుత్వం కూడా వ్యాట్ త‌గ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించ‌డం ద్వారా భార‌తీయులంద‌రికీ మోదీ ప్రభుత్వం గొప్ప బ‌హుమ‌తి అందించింది. ప్రధాని న‌రేంద్రమోదీకి ధ‌న్యావాదాలు తెలుపుతున్నా. దీనికి అద‌నంగా లీట‌ర్ డీజిల్ లేదా పెట్రోల్ మీద వ్యాట్ రూ.7 త‌గ్గిస్తున్నాం. దీంతో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.17, లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.12 త‌గ్గుతుంది అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ట్వీట్ చేశారు.

 

మ‌ణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూడా పెట్రోల్‌, డీజిల్‌ల‌పై రూ.7 వ్యాట్ త‌క్షణం త‌గ్గిస్తున్నట్లు ట్విట్టర్ వేదిక‌గా ప్రక‌టించారు.

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల‌పై వ్యాట్ రూ.7 త‌గ్గిస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లబ్ దేవ్ కుమార్ ట్వీట్ చేశారు. దీంతో శుక్రవారం త్రిపుర‌లో లీట‌ర్ డీజిల్ రూ.17, లీట‌ర్ పెట్రోల్ రూ.12 త‌గ్గుతుంది.

 

క‌ర్ణాట‌క సీఎం బ‌స్వరాజ్ బొమ్మై కూడా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల‌పై వ్యాట్ త‌గ్గిస్తున్నట్లు వ‌రుస ట్వీట్లు చేశారు. లీట‌ర్ డీజిల్/ పెట్రోల్ మీద రూ.7 వ్యాట్ త‌గ్గిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ల మీద వ్యాట్ త‌గ్గించాల‌ని నిర్ణయించిన‌ట్లు గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కార్యాల‌యం ప్రక‌టించింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రూ.2 వ్యాట్ త‌గ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఒడిశాలో లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద వ్యాట్ రూ.3 త‌గ్గనున్నది. ఇది శుక్రవారం అర్థరాత్రి నుంచి అమ‌లులోకి రానున్నది.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ స‌ర్కార్ కూడా వ్యాట్ త‌గ్గించివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల త‌గ్గింపుతో పెట్రోల్ లేదా డీజిల్ మీద లీట‌ర్‌కు రూ.12 భారం త‌గ్గనున్నది.

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ల‌పై వ్యాట్ రూ.7 త‌గ్గించివేసింది. దీంతో సిక్కింలో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.12, లీట‌ర్ డీజిల్ మీద రూ.17 త‌గ్గిపోనున్నది.