Agnipath Scheme Latest Update: అగ్నిపథ్ స్కీం ఆందోళనలపై వెనక్కు తగ్గిన కేంద్రం, కీలక నిర్ణయం ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
Union Home Minister Amit Shah | (Photo Credits: ANI)

Agnipath Scheme Latest Update: అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం శనివారం ప్రకటించింది. 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది.

ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం  గురువారం రాత్రి స్పందించింది. 2022 రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అగ్నివీరులుగా నియమితులయ్యేవారికి గరిష్ఠ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు పెంచింది. త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.