శని, శుక్ర మరియు గురు గ్రహాలకు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఓ వ్యక్తి జాతకంలో శని, శుక్ర, గురు గ్రహాలు సరిగా లేకుంటే ఆ వ్యక్తికి ఎప్పుడూ ఏదీ కలిసి రాదు. కస్టపడి పనిచేసినా ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఎవరి జాతకంలోనైనా ఈ మూడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే.. వారు శాంతి కోసం కొన్ని నివారణలు చేయాల్సి ఉంటుంది. అయితే గురు, శుక్ర, శని గ్రహాల అశుభ ప్రభావాలను నివారించడానికి మీరు ఎలాంటి తప్పులు (Astrological Remedies) చేయకూడదో..జ్యోతిష్యులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.
మీకు శని అశుభ స్థానంలో ఉండి శని యొక్క చెడు దృష్టిని నివారించాలనుకుంటే (Overcome Bad Planetary Effects) ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. లేదంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. శని నివారణ కోసం ఎవరికీ అబద్ధం చెప్పడం కాని, మోసం చేయడం కాని చేయవద్దు. అలాగే తప్పుడు మార్గంలో ఎవరి సొమ్మును లాక్కోవద్దు. కష్టపడే ప్రజల శ్రమను దోపిడీ చేయవద్దు. అలానే వికలాంగులను వేధించడం కానీ ఎగతాళి కానీ చేయవద్దని సూచిస్తున్నారు.
మీరు బృహస్పతి గ్రహం అశుభ ఫలితాలను నివారించాలనుకుంటే.. జ్ఞానులను, గురువులను, సాధువులను అస్సలు అవమానించకూడదు. జ్ఞానానికి మరియు విద్యకు గురువు కారకుడు కాబట్టి ఒకరి విద్యకు ఆటంకం కూడా కలిగించకూడదు. అలాగే మీ చుట్టుపక్కల వారిని ఎవరినీ విమర్శించరాదు. ఇక శుక్ర గ్రహ అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, ప్రేమ, ఆనందం లభిస్తాయి. శుక్రుడు సరైన స్థానంలో లేకుంటే మాత్రం ఆ వ్యక్తి జీవితం మొత్తం పేదరికంతో గడపాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం కూడా అంతగా బాగుండదు. ఇవి మీ దరిచేరకుండా ఉండాలంటే.. ప్రేమలో ఎవరినీ మోసం చేయవద్దు. స్త్రీలను అస్సలు అవమానించవద్దు. డబ్బు విషయంలో ఎవరినీ బాధపెట్టవద్దు. పొరపాటున కూడా డబ్బు గురించి గొప్పగా చెప్పుకోవద్దు.