Representational Image. | (Photo Credits: Pixabay)

Bengaluru, March 16: అర్ధరాత్రి ఒంటరిగా చిక్కిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసి, ఆపై కత్తితో బెదిరించి అతడి వద్ద నుంచి రూ. 4,400 దోచుకున్న ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని బనశంకరి స్టేజ్- 2 ప్రాంత నివాసి అయిన చెందిన 37 ఏళ్ల సతీష్ నగరంలోని డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సతీష్ సాధారణంగా తన స్కూటర్‌ను సమీపంలోని దేవేగౌడ పెట్రోల్ బంక్ దగ్గర పార్క్ చేసి, అక్కడ నుంచి తమ ఆఫీసుకు చెందిన క్యాబ్ ద్వారా ప్రయాణం చేస్తాడు. గత శుక్రవారం కూడా ఎప్పట్లాగే పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి ఆఫీస్ వెళ్లిపోయాడు. ఆఫీస్ ముగిసిన తర్వాత వీకెండ్ పార్టీ కోసం తన స్నేహితుడితో కలిసి విందుకు వెళ్లాడు. తిరిగి రాత్రి 12:20 సమయంలో సతీష్ అతడి స్నేహితుడు మహేశ్ కలిసి బైక్ పార్క్ చేసిన దగ్గరికి వచ్చారు. అయితే బైక్ 'కీ' పోగొట్టుకోవడంతో అక్కడే వెతుకుతూ ఇప్పుడు అర్ధరాత్రి ఇంటికి ఎలా వెళ్లాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు.

అక్కడే ఒక మినీ బస్సులో ఉన్న డ్రైవర్ (28) మరియు అతడి స్నేహితుడు (25) కలిసి ఎక్కడికెళ్లాలని అడుగుతూ తాము తీసుకెళ్తామని చెప్పారు. దీంతో మహేశ్ డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం వెళ్లగా సతీష్ బస్సు డ్రైవర్, అతడి స్నేహితుడితో కలిసి ఏదో 'టైంపాస్' గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలోనే ఆ బస్సును డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు. తన ఫ్రెండ్ మహేశ్ రాలేదని చెప్తున్నా వినిపించుకోకుండా సతీష్ మెడపై కత్తి పెట్టి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారు. అలా రెండు మూడు ఏటీఎంలలో డబ్బును సతీష్ ద్వారా విత్ డ్రా చేయించడానికి ప్రయత్నించగా ఎందులోనూ డబ్బు లేదు. దీంతో అర్ధరాత్రంతా 4 గంటల పాటు అతణ్ని బస్సులోనే బంధించి నగరంలో చక్కర్లు కొట్టిస్తూ వారిద్దరూ కలిసి సతీశ్ కు నరకం చూపించారు. మరొక ఏటీఎం వద్ద ఆపి, డబ్బు విత్ డ్రా చేయాల్సిందిగా బెదిరించారు. అయితే సతీశ్ వద్ద రూ. 4,400 కంటే మించి అతడి ఖాతాలో ఒక్కరూపాయి కూడా లేదు. దీంతో అవే తీసేసుకున్నారు. ఇక లాభం లేదు, చంపేద్దామని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సతీష్ వాళ్లను వేడుకున్నాడు, భార్యాపిల్లలు ఉన్నారు, వదిలేయాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. దీంతో నిందితులిద్దరూ సతీష్ ఫోన్ తీసుకొని అతడి భార్యకు డబ్బు పంపించాల్సిందిగా మెసేజ్ చేశారు.  మనిషి మాంసంతో వంట చేసిన భర్త, ఆ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్న భార్య

బస్సు ఒక చోట ఆపి ఇప్పుడు సతీష్ ను ఏం చేద్దాం అని దుండగులిద్దరూ ఆలోచనలు చేస్తుండగా ఇంతలో సతీష్ వారి కళ్లు గప్పి పారిపోయాడు. అది గమనించి వీరు కూడా సైలైంట్ గా అక్కడ్నించి ఎస్కేప్ అయ్యారు. సతీష్ తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బస్సులో బంధించి డబ్బు కోసం తీవ్రంగా కొట్టారని, చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, నిందితులిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. ఒకరు 25 ఏళ్ల దీపక్ ఇతడు గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. మరొకరు డ్రైవర్ ప్రశాంత్ 29గా గుర్తించారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 394 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.