Manipur Students Killing (PIC@ ANI X)

Imphal, OCT 01: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జూలైలో మణిపూర్‌లో జరిగిన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. వారి ఫొటోలు గతవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మే 3న మైతీ, కుకీ జాతుల మధ్య హింస ప్రారంభమైన ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతం జిల్లా చురచంద్‌పూర్‌లో నిందితులు ఉన్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌కు వారిని తరలించారు. అక్కడ ఉన్న సీబీఐ బృందానికి అప్పగించారు. అనంతరం నిందితులను విమానంలో అస్సాం రాజధాని గౌహతికి తరలించారు. అయితే నిందితుల అరెస్ట్‌ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

 

కాగా, అరెస్టైన నలుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతర నిందితులను పావోమిన్‌లున్ హాకిప్, మల్సాన్ హాకిప్, లింగ్‌నీచాంగ్ బైట్, తిన్నిఖోల్‌గా గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థిని స్నేహితుడు లింగ్‌నీచాంగ్ బైట్ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు నేరం చేసి తప్పించుకున్నప్పటికీ ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మణిపూర్‌ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.