New Delhi, March 12: స్వలింగ వివాహాలపై కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. స్వలింగ వివాహాలను (Same Sex Marriage) అధికారికంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన వాదనలు వినిపించింది.ఈ రకమైన వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని సుప్రీం కోర్టుకు (Supreme Court) తెలిపింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం, లైంగిక సంబంధాలు కలిగి ఉండటం నేరం కాకపోయినప్పటికీ, భార్యాభర్తల సంబంధానికి, భారతీయ సంస్కృతికి ఇది విరుద్ధమని కేంద్రం అభిప్రాయపడింది. స్త్రీ, పురుషుల కలయిక ద్వారా జన్మించిన పిల్లలు భవిష్యత్‌లో మరి కొందరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారుతారని చెప్పిన కేంద్రం.. స్వలింగ సంపర్కులతో ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. న్యాయ విధానాలకు వ్యతిరేకంగా స్వలింగ సంపర్క జంటలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. ఇటీవల కాలంలో నాలుగు స్వలింగ సంపర్క జంటలు తమ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తన వివరణ తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.
స్వలింగ వ్యక్తుల వివాహాన్ని (Same-Sex Marriage) నమోదుచేసి, వాటిని గుర్తించినట్లయితే ప్రస్తుత వివాహ చట్టంలోని కొన్ని నిబంధలను వారు ఉల్లంఘించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఎన్నో మతాలకు నిలయమైన భారత్‌లో ఆయా మతాల వారీగా వివాహ చట్టాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పిన కేంద్రం.. స్వలింగ వ్యక్తుల వివాహాలను గుర్తిస్తే.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని, కొన్ని నిబంధలను అతిక్రమించే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. స్త్రీ, పురుషులను ఒకటిగా చేయడమే వివాహం ముఖ్య ఉద్దేశమన్న కేంద్రం.. సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహం అంతర్గత అర్థం ఇదేనని చెప్పింది. కానీ, ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడం, దానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని, ఆచార వ్యవహారాలకు భంగం కలిగించకూడదని తెలిపింది.
‘‘ సాధారణంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్త్రీ పురుషులు ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారికి కొన్ని సామాజిక బాధ్యతలు, హక్కులు కూడా ఉంటాయి. వివాహానికి చట్టపరమైన గుర్తింపు కంటే.. సామాజిక పరమైన గుర్తింపే ఎక్కువ. సంప్రదాయబద్ధంగా వివాహ బంధం అడుగుపెట్టినవారికి కట్టుబాట్లు ఉంటాయి. తద్వారా వాళ్లకు నియంత్రణ ఉంటుంది. స్వలింగ వివాహాల విషయంలో ఇది ఉండకపోవచ్చు. ఒకే లింగానికి చెందిన వ్యక్తుల వివాహాన్ని గుర్తిస్తే కుటుంబ సమస్యలు కూడా ఎక్కువవుతాయి’’ అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.