Image used for representational purpose. | (Photo-PTI)

Hyderabad, August 28: భారతీయ జీవికలో, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం, అందరికీ ఆహారం అందిస్తున్న రంగం, పరిశ్రమలకు అత్యంత కీలకమైన ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమే అని కేసీఆర్ పేర్కొన్నారు. భారత దేశానిది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతున్నదని అన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సీఎం కోరారు.

నాబార్డ్ చైర్మన్ జి.ఆర్. చింతల సీఎం కేసీఆర్ ను గురువారం కలిసిన సందర్భంగా వ్యవసాయ రంగం అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.

‘‘భారతదేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయ దారులే. దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండి పెట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలి. దీంతో పాటు వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీనికోసం నాబార్డు అధ్యయనం చేయాలి’’ అని సీఎం కేసీఆర్ కోరారు.

 సామూహిక వ్యవసాయం జరగాలి; సీఎం కేసీఆర్

 

‘‘వ్యవసాయం కూడా ఎటు పడితే అటు, ఎలా పడితే అలా నడుస్తున్నది. దేశంలో రకరకాల భూభాగాలున్నాయి. కొండ ప్రాంతాలు, శీతల ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలున్నాయి. ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి, వాటినే సాగు చేయించాలి. దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడీ విధానం అవలంభించాలి. వ్యవసాయ ఉత్పత్తులు పెరగగానే సరిపోదు. దానికి అనుగుణమైన మార్కెట్ లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి పంటలు పండిచే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం ఉండాలి’’ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

‘‘పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తున్నది. పారిశ్రామికీకరణ కూడా జరగాలి. కాబట్టి భారతదేశంలో వ్యవసాధారిత పరిశ్రమలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది.  రైతులు సంఘటిత వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే విధంగా ప్రోత్సహించాలి. దానికి తగిన భూమికను ప్రభుత్వాలు కల్పించాలి.  అలా సామూహిక వ్యవసాయం చేయడంతో పాటు సంఘటిత రైతులు ఆహార ఉత్పత్తులను వినిమయ వస్తువులుగా (వాల్యూ ఆడ్ చేసి) మార్చి అమ్మితే ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సామూహిక వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి.

రైతులే పంటలను ప్రాసెస్ చేసి అమ్మే విధంగా యంత్రాలను అందించాలి. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను పెట్టాలని నిర్ణయించుకున్నది అందుకే. ఇదే విధానం దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అవసరమైన ఆర్థిక చేయూత అందించే పథకాలు/కార్యక్రమాలకు నాబార్డు రూపకల్పన చేయాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.

‘‘వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య కూలీల కొరత. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. నాటు వేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, వరికోత యంత్రాలు, వివిధ పంటలు కోసే యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలి. దీనికి కూడా అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం అన్నారు.

డిసిసిబి బ్యాంకులు మరింత సమర్థ వంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.