New Delhi, January 19: కోవాగ్జిన్ టీకాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ (Covaxin Fact Sheet) రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో.. ఎవరు టీకా తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు అనే అంశంపై క్లారిటీ (Covaxin Advisory) ఇచ్చింది. బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్న వారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు .. కోవాగ్జిన్ టీకాను తీసుకోరాదు అని భారత్ బయోటెక్ సంస్థ తన ఫ్యాక్ట్ షీట్‌లో వార్నింగ్ ఇచ్చింది.
కాగా రెండు రోజుల క్రితమే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ (COVID-19 Vaccination Drive Launch) మొదలైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారికి అనారోగ్య సమస్యలు వస్తుండటంతో భారత్ బయోటెక్ సంస్థ తన వెబ్‌సైట్‌లో కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన పలు సూచనలు చేసింది. అలర్జీ, జ్వరం, బ్లీడింగ్ డిజార్డ్‌లు ఉన్నవారు.. డాక్టర్లు లేదా వ్యాక్సిన్ పంపిణీదారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలని భారత్ బయోటెక్ తన సూచనల్లో పేర్కొన్నది.
రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే మందులు వాడే వారు ఎట్టిపరిస్థితుల్లో టీకా తీసుకోవద్దు అని కంపెనీ హెచ్చరించింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా కోవాగ్జిన్ తీసుకోకూడదు. మరో కంపెనీ టీకా తీసుకున్న వారు.. తమ టీకా వాడవద్దు అని భారత్ బయోటెక్ తన మార్గదర్శకాల్లో స్పష్‌టం చేసింది. కోవాగ్జిన్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తన ఫ్యాక్ట్ షీట్ లిస్టులో భారత్ బయోటెక్ కంపెనీ కొన్ని అంశాలు వెల్లడించింది.
టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దురద వచ్చే అవకాశాలు ఉన్నాయి. వళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, బలహీనత, దద్దులు, నలత, వాంతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కోవాగ్జిన్ వల్ల అలర్జీ రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా.. టీకా తీసుకున్న తర్వాత ఓ అరగంట పాటు వ్యాక్సిన్ సెంటర్‌లోనే ఉండాలని భారత్ బయోటెక్ సంస్థ సూచనలు చేసింది. తమ కంపెనీకి చెందిన రెండవ డోసు టీకా తీసుకున్న తర్వాత.. మూడు నెలల పాటు ఫాలో అప్ ఉంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది.