COVID-19 Candidate Vaccine Ready For Pre-Clinical Tests | (Photo Credits: IANS)

New Delhi, February 18: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నోవెల్ కరోనావైరస్ వ్యాధి (COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో మరో పురోగతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎవరికివారే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేసుకునేందుకు ప్రయోగాలు చేస్తుండగా, తాజాగా ఇండో- అమెరికన్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒక అడుగు ముందుకేసి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగింది.

పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ కోడజెనిక్స్ (Codagenix)  సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి.  ఇప్పుడు ఈ క్యాండిడేట్ వైరస్ వ్యాక్సిన్ (CVV) ప్రీ-క్లినికల్ పరీక్షలకు సిద్ధంగా ఉంది.  ఈ వ్యాక్సిన్‌ను ఆరునెలల్లోపు మనుషులపై ప్రయోగించనున్నారు. ఈలోపు వ్యాక్సిన్‌తో జంతువులపై ప్రయోగాలు చేపట్టనున్నారు.

ఈ క్యాండిడేట్ వ్యాక్సిన్ ప్రయోగశాలలో పుట్టించబడిన సింథటిక్ వైరస్‌ను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది. ఇది వైరస్‌ను ఎదుర్కొనేలా కవచాన్ని నిర్మించుకోవడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. అయితే అమెరికాకు చెందిన మా భాగస్వామి కోడజెనిక్స్ యొక్క ప్రయోగశాలలో CVV వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా అన్ని దశలు దాటి చాలా ముందుకు వెళ్లిపోయాము, మేము తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కోవిడ్19 వైరస్‌కు శక్తివంతమైన రోగనిరోధకత ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుందని అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదార్ పూనవల్లా పేర్కొన్నారు.

కాగా, ఈ వ్యాక్సిన్ గనుక జంతువులపై మంచి ఫలితాలను చూపించి అందుబాటులోకి వస్తే కరోనావైరస్ ను అరికట్టే తొలి మేడ్ ఇండియా వ్యాక్సిన్ గా అవతరించనుంది. ఇంతకుముందు కూడా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలో ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) యొక్క డేంజరస్ పాథోజెన్స్ బృందం కరోనావైరస్ ను కృత్రిమంగా పుట్టించింది. వీరి ప్రయోగాలు ప్రపంచంలోని ఇతర శాస్త్రజ్ఞులకు ఈ వైరస్ పై ముందస్తు అధ్యయనాలు నిర్వహించడానికి ఉపయోగపడతాయి.

ఇదిలా ఉండగా, చైనాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,868 కు చేరింది, అలాగే కరోనావైరస్ పాజిటివ్‌గా ధృవీకరించబడిన కేసుల సంఖ్య 72,436 కు చేరుకుందని చైనా రాష్ట్ర ఆరోగ్య కమిటీ తెలిపింది.