Jaipur, April 06: పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులు వారిని మందలించడం కామన్. కొందరు గట్టిగా అరుస్తారు, మరికొందరు నచ్చ చెబుతారు. ఇంకొందరు నాలుగు దెబ్బలు తగిలించైనా దారిలోకి తేవాలని ప్రయత్నిస్తారు. కొందరు తిడతారు, మరికొందరు కొడతారు. ఏదైనా పిల్లల మంచి కోసమే. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. అయితే, కూతురు సరిగా చదవడం లేదని ఓ తండ్రి రెచ్చిపోయాడు. కూతురిని కొట్టి చంపేశాడు (Daughter Beaten To Death). రాజస్థాన్ లోని (Rajasthan) సిరోహీ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. 11వ తరగతి పరీక్షలకు సరిగా చదవడం లేదనే కారణంతో ఓ తండ్రి తన 17ఏళ్ల కూతురిని కర్రతో చితకబాదాడు. దెబ్బలను తట్టుకోలేకపోయిన బాలిక కన్నుమూసింది. బాలిక మామయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు ఫతే మహమ్మద్ ను(42) అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
కూతురు పరీక్షలకు సరిగా చదవడం లేదని తండ్రి మహమ్మద్ కోపంతో ఊగిపోయాడు. పట్టరాని కోపంలో విచక్షణ కోల్పోయాడు. కర్రతో ఆమెను చితక్కొట్టాడు. ఎంతగా కొట్టాడంటే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలను తాళలేకపోయిన బాలిక చనిపోయింది (Daughter Beaten To Death). అంతర్గత గాయాలతో ఆమె కన్నుమూసింది. అయితే, బాలిక మృతికి అసలు కారణం ఏంటన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. పరీక్షలకు సరిగా చదువుకోవడం లేదని కన్నకూతురిని తండ్రే కొట్టి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ విషయం తెలిసి స్థానికులు షాక్ తిన్నారు. చదువుకోలేదనే కారణంతో కొట్టి చంపేయడం కరెక్ట్ కాదంటున్నారు. పిల్లలకు నచ్చ చెప్పి దారికి తెచ్చుకోవాలి కానీ, ఇలా కొట్టి చంపేయడం ఏంటని మండిపడుతున్నారు.