Rajkot, December 31: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 31, గురువారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. కొవిడ్ మహమ్మారితో పోరాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న కరోనా యోధులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా COVID19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ పొందిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. టీకాలు వేయించుకున్న తర్వాత ప్రజలు కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
"ఆరోగ్యం ఉంటే, సంపద ఉన్నట్లే అని 2020 సంవత్సరం మాకు బాగా నేర్పించింది. ఈ ఏడాది పూర్తిగా సవాళ్లతో నిండిపోయింది. అందుకే ఈ సంవత్సరపు చివరి రోజున వారి ప్రాణాలను పణంగా పెట్టి, మన కోసం పోరాడుతున్న కరోనా యోధులను గుర్తుంచుకునే రోజు. వారందరికీ నేను నమస్కరిస్తున్నాను" అని మోదీ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ "గతంలో జబ్ తక్ దవాయి నహీ, దిలాయి నహీ (ఎప్పటివరకు ఔషధం లేదో, అప్పటివరకు నిర్లక్ష్యం తగదు) అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఈ 2021లో మన మంత్రం దవాయి భీ, కడాయి భీ (ఔషధం ఉండాలి, జాగ్రత్తలు ఉండాలి) అవ్వాలి" అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నాయి, అయినప్పటికీ, ప్రజలు తమ రక్షణను తగ్గించకూడదు, టీకా పొందిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రధాని ప్రజలకు హితబోధ చేశారు.
Watch PM Modi's Speech Here:
My speech at the foundation stone laying ceremony of AIIMS Rajkot. https://t.co/rUpN4kgmMk
— Narendra Modi (@narendramodi) December 31, 2020
ప్రపంచ ఆరోగ్యానికి నాడీ కేంద్రంగా భారతదేశం మారిందని మోదీ అన్నారు. భారతదేశంలో వైద్య విద్యను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తున్నామని తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పడిన తరువాత, ఆరోగ్య విద్య యొక్క నాణ్యత మరియు పరిమాణం మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని వ్యాక్సిన్ పంపిణీ తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించిన కొద్దిసేపటి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీపై తాజాగా సమాచారం వెళ్లింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యూటీలు సమర్థవంతంగా టీకా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సర్క్యులర్ జారీ అయింది.
దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ మరియు ఫైజర్ సంస్థలు కరోనావైరస్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బుధవారం పరిగణనలోకి తీసుకుంది. అయితే శుక్రవారం ప్యానెల్ మళ్లీ సమావేశం కానుంది. వ్యాక్సిన్లను నిపుణుల ప్యానెల్ క్లియర్ చేసిన తర్వాత, తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కి వెళతాయి. అలా ఆమోదం పొందిన వ్యాక్సిన్ ను జనవరి నెల నుంచే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.