Delhi Anaj Mandi Fire: అందరూ కూలీలే, ఎటు చూసినా విషాద ఛాయలే, ఢిల్లీ చరిత్రలో రెండో అతి పెద్ద అగ్ని ప్రమాదం, 43కు చేరిన మృతుల సంఖ్య, విష వాయువులతో నిండిన బిల్డింగ్, ఊపిరి ఆడక కార్మికుల మృత్యువాత, దర్యాప్తుకు ఆదేశించిన ఢిల్లీ సర్కారు
Delhi fire tragedy: 43 killed in blaze; Building had no clearance Delhi Police arrest owner of building (Photo-ANI)

New Delhi, December 8: దేశ రాజధానిలో అత్యంత ఘోరమైన ప్రమాదం (Delhi Fire Tragedy) జరిగింది. ఢిల్లీ చరిత్రలో రెండో అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన ఈ అగ్ని ప్రమాదంలో 43 మంది చనిపోయారు. మరో 22 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఝాన్సీ రోడ్‌లోని అనాజ్ మండీ(Anaj Mandi)లో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తెల తెల వారగానే వారి బతుకులు అగ్నికి ఆహుతైపోయాయి.

అనాజ్‌మండీలో ఆరంతస్తుల భవనంలో ప్లాస్టిక్ ఫ్యాకర్టీ ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.కార్మికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాద విషయం తెలియలేదు. తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. తప్పించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఊపిరిఆడక చాలా మంది సృహ తప్పిపడిపోయారు. మంటల్లో సజీవ దహనమయ్యారు.

Delhi Fire Tragedy

అగ్నిప్రమాదం వార్త తెలియగానే ఫైర్ సిబ్బంది స్పందించారు. 30కి పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. భవనంలో చిక్కుకున్న 56మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. అయితే ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. వెంటనే పక్కనే ఉన్న రెండు భవనాలకు కూడా మంటలు పాకాయి. చుట్టూ ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో లోపలున్నవారు ఎటూ కదల్లేని పరిస్థితి. మొత్తంగా 43 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువమంది కూలీలే. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు.

ఇరుకుగా ఉండటం, అత్యవసర మార్గాలు లేకపోవడంతో....

అనాజ్ మండి ప్రాంతం ఇరుకుగా ఉండటంతోపాటు.. మంటల నుంచి తప్పించుకోవడానికి నిబంధనల ప్రకారం ఉండాల్సిన అత్యవసర మార్గాలు లేకపోవడంతో.. కార్మికులు అగ్నికి ఆహుతయ్యారని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదానికి గురైన భవంతిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గుర్తించాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో ఎక్కువగా విష వాయువులు ఉండటంతో ఊపిరి ఆడక చాలా మంది కార్మికులు చనిపోయారని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ భవంతిలో చాలా కిటికీలను పూర్తిగా మూసివేశారని ఆయన చెప్పారు.

1997 తర్వాత ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విషాద ఘటన

ప్రస్తుతం జరిగిన అగ్నిప్రమాదం 1997 తర్వాత ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విషాద ఘటన( worst fire accident since the 1997). 1997లో ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో (Uphaar Cinema tragedy) జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇప్పటి ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనాకు వచ్చినప్పటికీ, అసలు కారణాలేంటనేది దర్యాప్తు జరపాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.

క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న ఢిల్లీ సీఎం

మంటలను అదుపు చేశాక లోపలికి వెళ్లి చూడగా కార్మికులు మాంసపు ముద్దలుగా కనిపించారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు. గాయపడ్డవారిని లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్, సప్ధర్ జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులకు తరలించామని చెప్పారు.

అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేవు

ప్రమాదం జరిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి చాలా కష్టపడ్డారు. కనీసం అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో.. గాయపడ్డవారిని రోడ్డు వరకు భజాలపై మోసుకుంటూ రోడ్లపైకి తీసుకువచ్చి.. లోకల్‌ ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అగ్నిప్రమాదం ప్రధాని మోడీని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని మోడీ రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సహాయం అందించనున్నారు. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government)మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

బీహర్ సీఎం నితీష్ కుమార్ ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంలో మరణించిన బీహరీ వాసులకు రూ. 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. లక్ష రూపాయలు లేబర్ నిధి నుండి మరో లక్ష రూపాయలు సీఎం రీలీఫ్ పండ్ నుంచి అందిస్తామని తెలిపారు. దీంతో పాటుగా క్షతగాత్రులకు తక్షణమే వైద్య సదుపాయం అందివ్వాలని అధికారులను కోరారు.

రూ. 2 లక్షల నష్టపరిహారం ప్రకటించిన బీహార్ సీఎం

ప్రమాదం జరిగిన భవనంలో ఓ ఫ్యాక్టరీ నడుస్తోందని, సిబ్బంది రాత్రి నిద్రించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ఈ భవనానికి ఫైర్ క్లియరెన్స్ లేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పరారైన భవన యజమాని రేహాన్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. భారత శిక్షా స్మృతి 304( IPC sections 304) కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందం(Forensic Science Lab) ఘటనా స్థలికి చేరుకున్నారు.

అదుపులోకి భవన యజమాని

మంటల్లో చిక్కుకున్న భవంతిలోకి మందుగా ప్రవేశించిన ఫైర్‌మెన్ రాజేశ్ శుక్లా 11 మందిని కాపాడారు. ఈ క్రమంలో ఆయన కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది ప్రాణాలను కాపాడిన శుక్లాను ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అభినందించారు. ఆయన సాహసోపేతంగా విధులను నిర్వర్తించారంటూ రియల్ హీరోకు సెల్యూట్ చేశారు