New Delhi, August 20: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మోటార్ వాహన నియమాలు మరియు భద్రత చట్టానికి 1989 సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు భద్రత కోసం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసింది. చలాన్‌ల విధింపు కోసం ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలను ఉపయోగించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే పదిహేను రోజుల్లోపు నేరస్థుడికి చలాన్‌లను పంపాల్సి ఉంటుంది, అలాగే చలాన్ కట్టేంత వరకు అందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్ నిల్వ చేయాలని పేర్కొంది.
జాతీయ రహదారులు, స్టేట్ హైవేలు మరియు క్లిష్టమైన జంక్షన్లలో కనీసం 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రధాన నగరాల్లో మరియు వాహనాల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న చోట్ల స్పీడ్ కెమెరా, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరా, స్పీడ్ గన్, బాడీ వేరబుల్ కెమెరా, డాష్‌బోర్డ్ కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), వెయిట్ ఇన్ మెషీన్ (WIM) లాంటి పరికరాలు తప్పనిసరిగా ఉంచాలంటూ రాష్ట్రాల పాలనా యంత్రాంగాలకు కేంద్రం సూచించింది.
నిర్దేశించిన వేగ పరిమితిలో డ్రైవింగ్ చేయక పోవడం, అనధికార ప్రదేశంలో వాహనాన్ని ఆపడం లేదా పార్కింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం మరియు సేఫ్టీ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ ను జంప్ చేయడం, వాహనం నడుపుతున్న సమయంలో చేతిలో మొబైల్ వాడటం, నిబంధనలకు విరుద్ధంగా ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడం, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం, తన డ్రైవింగ్ ప్రమాదకరమని సక్రమంగా లేదని తెలిసినా జాగ్రత్త పడకపోవడం, పరిమితికి మించిన బరువుతో వాహనాన్ని నడపడం లాంటి నిబంధనలకు జరిమానా విధిస్తూ జారీ చేసే చలానాలను ప్రాంతం, తేదీ, సమయం ఉండే విధంగా సమాచారం ఉండాలని సూచించింది.
ఇది వరకు రోడ్డు పక్కన పోలీసులు లేదా ట్రాఫిక్ సిబ్బంది నిల్చుంటే చాలా మంది వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొద్ది దూరం ముందే ఆగిపోయే వేరే ప్రత్య్నామ్నాయ మార్గాల్లో వెళ్లేవారు. అయితే కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రతిచోటా ఎలక్ట్రానికి పర్యవేక్షణ ఉంచనున్నారు. దీని ప్రకారం కెమెరాకు చిక్కితే ఇకపై చలాన్లు కట్టాల్సి ఉంటుంది.