Necrotizing Fasciitis (Photo-Pixabay)

New Delhi, Oct 31: శరీరంలోని మాంసాన్ని తినేసే ప్రమాదకర బ్యాక్టీరియా నెక్రోటైజింగ్ ఫాసిటిస్ (Necrotizing Fasciitis) బారినపడి కోల్ కతాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ 44 ఏళ్ల మృణ్మయ్ రాయ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది అత్యంత ప్రాణాంతక నెక్రోసిస్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు. చర్మం కింది కణజాలంలో వ్యాపించే ఈ మాంస భక్షక బ్యాక్టీరియా (Flesh-eating bacteria) ఎంతో అరుదైనదని వివరించారు. ఇది ఎంతో వేగంగా వ్యాపిస్తుందని, సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణహాని తప్పదని వెల్లడించారు.

మధ్యమ్ గ్రామ్ ప్రాంతానికి చెందిన మృణ్మయ్ రాయ్ ఇటీవల రైలులో ప్రయాణిస్తూ బోగీ నుంచి పడిపోయాడు. ఆ సమయంలో నడుం కింది భాగంలో అతడికి ఓ రాడ్ గుచ్చుకుంది. ఓ వారం పాటు స్థానిక నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందాడు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. ట్రామా కేర్ యూనిట్ లో అతడికి చికిత్స అందించగా, పరిస్థితి మరింతగా విషమించింది.

దేశంలో కొత్త రకం బ్యాక్టీరియా కలకలం, శరీరంలోని మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాతో ఓ వ్యక్తి మృతి, అతని జననాంగాలను, కింద అవయువాలను తినేసిన వైరస్

అతడి తీవ్ర అనారోగ్యానికి కారణం ఏంటన్నది వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అతడు ప్రాణాంతక నెక్రోటైజింగ్ ఫాసిటిస్ (Necrotizing Bacteria) బారినపడినట్టు నిర్ధారణ అయింది. అప్పటికే ఆ మాంసాహార బ్యాక్టీరియా అతడి జననావయవాల లోపలి భాగాలను తినేసినట్టు గుర్తించారు. ఇతర శరీర భాగాల కణజాలం కూడా నెక్రోసిస్ కు గురికావడంతో తాము ఏమీ చేయలేకపోయామని వైద్యులు తెలిపారు.

నెక్రోటైజింగ్ ఫాసిటిస్ బ్యాక్టీరియా మొదట రక్తనాళాలపై దాడి చేసి థ్రాంబోసిస్ (నాళాల్లో గడ్డలు) కలిగిస్తుందని మెడికల్ కాలేజి ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ వెల్లడించారు. కండరాలకు, కణజాలాలకు క్రమేపీ రక్త సరఫరాను తగ్గించి, చివరికి ఏమాత్రం రక్తం అందకుండా చేస్తుందని వివరించారు.కాగా, మృణ్మయ్ రాయ్ మద్యపానానికి బానిస అవడం వల్ల అతడిలో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, అందుకే అతడు నెక్రోసిస్ కు త్వరగా బలయ్యాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.