Image used for representational purpose | (Photo Credits: PTI)

Gujarat Novembe 13: సోషల్ మీడియా వచ్చాక నేర్చుకోలేనిదంటూ ఏదీ లేకుండా పోయింది. చదువు, మేకప్, వంట, సంగీతం ఇలా ఏది కావాలన్నా నేర్చుకోవచ్చు. అయితే దీన్ని మంచికి ఉపయోగించేవాళ్లు ఉన్నట్లే, చెడుకోసం ఉపయోగిస్తున్నవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే యూట్యూబ్ చూసి తయారు చేశాడు. వీడియోలు చూస్తూ డ్రగ్స్ ల్యాబ్‌ నెలకొల్పాడు. అది కూడా నిషేధిత డ్రగ్స్‌ మెథ్‌ను తయారు చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో చోటు చేసుకుంది.

జైమిన్ సావ‌ని అనే వ్యక్తి డ్రగ్స్‌కు అల‌వాటు ప‌డిపోయి అవి లేకుండా ఉండ‌లేక‌పోయాడు. కొన్ని రోజులు డ్రగ్స్ అమ్మి డ‌బ్బులు సంపాదించాడు. డ్రగ్స్ వేరే వాళ్ల ద‌గ్గరి నుంచి తెచ్చి అమ్మే బ‌దులు, త‌నే త‌యారు చేస్తే ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయనుకున్నాడు. వెంటనే యూట్యూబ్‌లో డ్రగ్స్ త‌యారు చేసే వీడియోలు చూశాడు. వాటిని చూస్తూ సూర‌త్‌లోని స‌ర్థానా అనే ప్రాంతంలో ల్యాబొరేట‌రీని ఏర్పాటు చేశాడు. అక్కడ డ్రగ్స్ త‌యారు చేయ‌డం ప్రారంభించాడు.

అయితే రాజస్థాన్‌కు చెందినప్రవీణ్ బిష్ణోయ్‌ అనే వ్యక్తి రూ.6 లక్షలు విలువచేసే డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అతని నుంచి వచ్చిన సమాచారం మేరకు సావనిని అరెస్ట్ చేశారు పోలీసులు. సూరత్‌లోని సావ‌ని ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు, డ్రగ్స్ త‌యారు చేయ‌డం కోసం ఉప‌యోగించే వ‌స్తువుల‌ను సీజ్ చేశారు.

అయితే య్యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ మొదట్లో తనకు డ్రగ్స్ తయారు చేయడం రాలేదని, డ్రగ్స్ డీలర్ల దగ్గర వాటిని తయారు చేయడం నేర్చుకున్నట్లు చెప్పాడు సావని. డ్రగ్స్ త‌యారీ కోసం రా మెటిరియ‌ల్‌ను ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి కొన్నట్లు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.