ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా (Guru Purnima 2022) అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. ”గు” అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ”రు” అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.
కాగా హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా ( Guru Purnima 2022) భావిస్తారు. ఈ ఏడాది గురు పౌర్ణమి 13 జూలై 2022 బుధవారం జరుపుకుంటున్నారు. గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి… గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము ఒకసారి తెలుసుకుందాము ? ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
గురు భగవానుడిని స్మరించుకుని, గురు పూర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. ‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః’ గురు పూర్ణమి చాతుర్మస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడీ వెళ్లకుండా ఒకేచోట ఉండి శిష్యులకు జ్ణానబోధ చేసే సమయమే చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి భూమిక.. ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపసంపన్నులను సమీపించి, పూజించి, జ్ణానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ రోజునే 4 రాజయోగాలు కూడా ఏర్పడటం వల్ల గురు పూర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. ఈ పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు ఎలాంటి సమస్య నుండైనా బయటపడతారు.
ఈ పరిహారాలు చేయండి
1. గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
2. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురు పూర్ణిమ నాడు అవసరమైన వారికి శనగ పప్పును దానం చేయండి.
3. మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
4. చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. గురు పూర్ణిమ రోజున గురువును పూజించి...ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వారికి పసుపు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
ఆషాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత
పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు ‘వేదనిధి’. ఆయన సతీమణి పేరు ‘వేదవతి’. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు.
ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.
ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు.
అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని వారు సెవిస్తారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.
కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి.
గురువులు ఎన్ని రకములు?
ఆధ్యాత్మిక గురువులు: వారి వారి లక్షణాలను హిందూ సంప్రదాయం ఇలా నిర్వచించింది .
సూచక గురువులు : ప్రకృతిలో లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య భొదలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిని భక్తులను తయారు చేస్తారు వీరు.
వేద గురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరింపజేస్తారు వీరు.
నిషిద్ద గురువులు : సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను భోదిస్తారు వీరు.
కామ్యక గురువులు : ధర్మ దాతలుగా సప్త సాధనాలు భోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన భక్తులను తయారు చేస్తారు.
భోధక గురువులు: వేదాంత గ్రంధ పరిచయం కలిగిస్తారు. భోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని చెప్తున్నారు.
నాద గురువులు : వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .
చాయానిది గురువులు : చాయానిది అనే ఒక పక్షి వుందట. దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు.
పరమ గురువులు : వీరు పరుసవేదిలా శిష్యుని తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు.
చందన గురువులు: చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు వీరు.
క్రౌంచక గురువులు: దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగా గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట. అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చెయగలడు.
వాచక గురువులు : సాంఖ్య ఉపదేశాలు భోధించి, పరమాత్మ సత్యమని, దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.
కారణ గురువులు : ఆసనాలు, ప్రాణాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం భోదించి అద్వైత స్థితిని కలిగిస్తారు.
సద్గురువులు : తెలుసుకోగల్గితే గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు.
నిజ గురువులు: పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు.