Coronavirus Outbreak | Representational Image (Photo Credits: PTI)

New Delhi, March 26: భారత్‌లో కోవిడ్19 అంతకంతకూ విస్తరిస్తున్నది.

వారం రోజుల్లోనే దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య లక్ష పెరిగింది. సెకండ్ వేవ్ పరిస్థితులు మరో రెండు నెలల వరకు కొనసాగుతాయని వైద్యారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో దేశంలో 25 లక్షల వరకు పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ మార్గం కాదని, ప్రజల సహాకారం మరియు వేగవంతమైన వ్యాక్సినేషనే మార్గం అని వారు  అంటున్నారు.

ఇక దేశంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్లతో పాటు ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వచ్చే వారు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆంక్షలు అమలు పరచనున్నారు.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 59,118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 35,952 కేసులు ఉన్నాయి.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,46,652కు చేరింది. నిన్న ఒక్కరోజే 257 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,60,949 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,987 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,12,64,637 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,21,066 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.09 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 3.55 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.36% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా 23,86,04,638 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,00,756 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 5.55 లక్షలు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 5,55,04,440 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.