New Delhi, April 13: దేశంలో నిన్న కొత్తగా 1,61,736 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 97,168 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,36,89,453 కు (Covid in India) చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 879 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,22,53,697 మంది కోలుకున్నారు. 12,64,698 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,85,33,085 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఛత్తీస్ గఢ్ లో (chhattisgarh) రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సహా, పలు పట్టణాల్లోని ఆసుపత్రులలో కరోనా శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. కరోనా రెండో వేవ్ సమయంలో (Seconad Wave in chhattisgarh) మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని, శవాలను దాచేందుకు కూడా అవసరమైన వసతులు లేవని డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యాధికారులు వెల్లడించారు.
మృతదేహాలను ఉంచేందుకు సరిపడినన్ని ఫ్రీజర్ బాక్స్ లు లేవని, అందుకే వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉంచాల్సి వస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని, కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబీకులు మృతదేహాలను తీసుకుని వెళ్లడం లేదని వాపోయారు. గడచిన వారం రోజులుగా ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్లు 100 శాతం నిండిపోయి ఉన్నాయని, కొత్తగా ఆక్సిజన్ అవసరమైన వారికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.
Here's Video
रायपुर में लाशों का अंबार, बंगाल में धुआँधार प्रचार। एक भारत श्रेष्ठ भारत। pic.twitter.com/5DPILBu4ti
— Vinod Kapri (@vinodkapri) April 12, 2021
కరోనా మరణాలు ఈ స్థాయిలో ఉంటాయని మేము ఎంతమాత్రమూ ఊహించలేదు. సాధారణ పరిస్థితుల్లో రోజుకు ఒకరు, లేదా ఇద్దరు మరణిస్తుంటారు. ఆ సంఖ్య 10 నుంచి 20కి చేరేసరికి ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. కానీ ఇప్పుడు రోజుకు 50 నుంచి 60 మంది కన్నుమూస్తున్నారు. మేము ఫ్రీజర్లను ఎక్కడి నుంచి తేగలం?" అని రాయ్ పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మీరా భాగెల్ వ్యాఖ్యానించారు.
కరోనాపై విజయం సాధిస్తున్నామన్న సమయం వచ్చిందని భావించిన వేళ, రెండో వేవ్ వచ్చేసిందని, అయితే, హోమ్ ఐసొలేషన్ వంటి సదుపాయాలు పెరిగాయని, అత్యధిక కేసుల్లో ఎటువంటి లక్షణాలూ ఉండటం లేదని, లక్షణాలున్న వారు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, ఒక్క రాయ్ పూర్ లో సరాసరిన రోజుకు 55 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండటం గమనార్హం.
కర్ణాటకలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్ (Karnataka Lockdown) ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప యోచిస్తున్నారు. ఈ నెల 17న బెళగావి లోక్‌సభ, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన అనంతరం లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు ఈ నెల 18 లేదంటే 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆలోగా కనుక కేసులకు అడ్డుకట్ట పడకుంటే 20వ తేదీ నుంచి పది రోజులపాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం, క్రియాశీల కేసులు 70 వేలకు పైగా ఉండడంతోనే అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసరం అయితే కనుక లాక్‌డౌన్ విధించక తప్పకపోవచ్చని సీఎం అన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు.
మహారాష్ట్రలో, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ప్రారంభమైన తరువాత, తొలిసారిగా సోమవారం నాడు కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 51,751 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాడు రాష్ట్రంలో 65 వేలకు పైగా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న 258 మంది వైరస్ కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారు. ఇక ముంబై మహా నగరంలోని కొత్త కేసులు సైతం ఒక్క రోజు వ్యవధిలో 9,989 నుంచి 6,893కు తగ్గాయి.