Coronavirus Outbreak: (Photo-IANS)

New Delhi, Mar 30: దేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.

5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు (Coronavirus Vaccine) వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,26,50,025 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,85,864 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా మంగళవారంనాడు ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. 'మా తండ్రిగారికి కోవిడ్-19 పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. కొన్ని లక్షణాలు కూడా కనిపించాయి. నాతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకూ హోం ఐసొలేషన్‌లోనే ఉంటున్నాం. ఇటీవల కాలంలో మమ్మల్ని కలిసేందుకు వచ్చిన వారు కూడా ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను' అని ఆ ట్వీట్‌లో ఒమర్ పేర్కొన్నారు.

చిత్తూరును వణికిస్తున్న కరోనా, అత్యధిక కేసులు ఆ జిల్లా నుంచే, రాష్ట్రంలో 24 గంటల్లో 997 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7,210కి చేరుకున్న మరణాల సంఖ్య

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్ నగరంలోని హోటల్ తాజ్ ఐదు నక్షత్రాల హోటల్ లో 76 మందికి కరోనా సోకింది. దీంతో తెహ్రీ గర్హ్వాల్ అధికారులు హోటల్ తాజ్ ను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.కరోనా కేసులు వెలుగుచూసిన హోటల్ తాజ్ ను శానిటైజ్ చేయించి ముందుజాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేశామని తెహ్రీ గర్హ్వాల్ ఎస్పీ తృప్తి భట్ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1660 కరోనా కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో మొత్తం 96,512 కరోనా కేసులు నమోదు కాగా, 1709 మంది మరణించారు.

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఐఐటీలో 10 మంది విద్యార్థులకు తాజాగా కరోనా సోకింది. దీంతో ఏప్రిల్ 4వతేదీ నుంచి కొత్త బ్యాచ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కల్లోలం నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు.కరోనా సోకిన 10 మంది విద్యార్థులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నామని భువనేశ్వర్ ఐఐటీ అధికారులు చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పుతిన్‌కు సైడ్‌ ఎఫెక్ట్స్‌, అనారోగ్య సమస్యలను స్వయంగా వెల్లడించిన రష్యా అధినేత, శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉందని తెలిపిన వ్లాదిమిర్‌ పుతిన్‌

కర్ణాటకలో కేసుల భారీగా పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని రకాలైన ర్యాలీలు, ఆందోళనలపై 15 రోజుల పాటు నిషేధం విధించారు. మాస్కులు ధరించని, భౌతికదూరం పాటించని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహారాష్ట్రలో ఒక్క మార్చి నెలలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం కలవరం రేపింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 29వతేదీ వరకు మహారాష్ట్రలో 5,90,448 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది సెప్టెంబరు నెలలో అత్యధికంగా 5,93,192 కరోనా కేసులు బయటపడ్డాయి.మార్చి కంటే ముందు నాలుగు నెలల్లో గత ఏడాది నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు 4,87,519 కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఒక్క సోమవారం రోజే 31,643 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 102 మంది మరణించారు. గత ఏడాది మార్చి 17 నుంచి ఇప్పటివరకు 27, 45,518 కరోనా కేసులు వెలుగుచూడగా, వారిలో 54,283 మంది కరోనాతో కన్నుమూశారు. రోజుకు 20వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనాతో ఒక్క మార్చినెలలోనే 2,129 మంది మరణించారు.

కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలిసారిగా 3 వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో ఆదివారం 2,870 మంది వైరస్‌ బారిన పడగా.. 2,583 మంది కోలుకున్నారు. అలాగే 59 మంది మృతి చెందారు. ఆ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్‌ (2,276), గుజరాత్‌ (2,270), కేరళ (2,216), తమిళనాడు (2,194), చత్తీ్‌సగఢ్‌ (2,153) రాష్ట్రాలు నిలిచాయి. ఈ రాష్ట్రాలే ప్రధానంగా వైరస్‌ వ్యాప్తిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతానికి 10 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

కరోనా వేళ.. భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది. పొరుగున ఉన్న నేపాల్‌ సైన్యానికి లక్ష డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందించింది. మరోవైపు పాకిస్థాన్‌లో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైంది. ఏప్రిల్‌ 1 నుంచి లాహోర్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ సడలింపులు మొదలయ్యాయి. మొదటి విడతగా ఇల్లు విడిచి బయటకు రాకూడదన్న నిబంధనను తొలగించింది.