Mumbai, November 13: ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (Bollywood legend Lata Mangeshkar)ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల మనసుదోచుకున్న లతా మంగేష్కర్ గుండె సమస్యలు, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి(Breach Candy Hospital)లో ఆమెకు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది.
ఆమె ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్(Lata Mangeshkar Health bulletin)ను విడుదల చేస్తూ, ఆమెకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నామని, ఇన్ ఫెక్షన్ అదుపులోకి వచ్చిన తరువాతనే వైద్య ప్రక్రియ అంశంలో ముందుకు వెళతామని బ్రీచ్ క్యాండీ డాక్టర్ పతీత్ సంధానీ వెల్లడించారు. ప్రస్తుతానికి లత ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
కాగా, లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో లక్షలాది మంది భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.
సంగతి తెలిసిందే. 90 ఏళ్ల లతా మంగేష్కర్ ప్రస్తుతం న్యుమోనియా(pneumonia)తో బాధపడుతున్నారు. ‘‘ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఏమీ చెప్పలేము. ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నామని డాక్టర్ సంధానీ (Dr Samdani) పేర్కొన్నారు.మరో వారం రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.
తన కెరీర్‌లో దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి లతా మంగేష్కర్ గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు. ఆమెను అంతా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో ఆమెను సత్కరించింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నేళ్ల నుంచి సినిమాలకు పాటలు పాడటం మానేశారు.
కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతున్నారు. ఇందుకు ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు సినిమాల్లో వస్తున్న పాటలన్నీ బూతు పదాలతో నిండిపోయి ఉన్నాయని అలాంటి పాటలను తాను పాడనని ఓ సందర్భంలో వెల్లడించారు.