Mumbai, November 18: ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువు ఏది అంటే మనిషి అని చెప్పాలేమో. మనిషి అన్నవాడు మానవత్వాన్ని మరిచి అతిక్రూరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ సమాజంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఓ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చోట కట్టేసి ఉన్న ఎద్దును ఓ వ్యక్తి జేసీబీ (JCB) తో వచ్చి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కొండలను తొలిచేందుకు, నేలను తవ్వేందుకు ఉపయోగించే ధృడమైన, పదునైన 'జేసీబీ బకెట్' (JCB Bucket) భాగంతో ఎద్దు యొక్క వీపు భాగంపై మోపి దానిని అలాగే భూమికి అణిచివేయడంతో ఆ ఎద్దు విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలియరాలేదు కానీ, భాషను బట్టి అది పశ్చిమ మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిని మహారాష్ట్ర స్థానిక నాయకులు, అధికారులు, సామాజిక కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లగా ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ జరిగిందో త్వరలోనే గుర్తించి, బాధ్యులైన వారిని జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద (Prevention of Cruelty to Animals Act) కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
Here's the video:
వీడియో ఆధారంగా అసలు ఆ ఎద్దును ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణం తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆ ఎద్దు పట్ల స్థానికులు కూడా కోపంగా ఉన్నట్లు తెలిసింది. "ఎవరిని చంపకముందే ఆ పిచ్చి ఎద్దును చంపేయ్.. మార్.. మార్" అంటూ అరవడం పట్ల ఆ ఎద్దు ద్వారా గ్రామంలో ఎవరికైనా హాని జరిగి ఉండవచ్చునని, అందుకే గ్రామస్తులు ఆగ్రహావేశాలతో ఇలాంటి చర్యకు పాల్పడ్డారా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది.
అయితే, ఏది ఏమైనా వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో ఎద్దులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రైతులు ఎద్దులను పూజిస్తారు. అలాంటిది ఒక ఎద్దును చంపడం అది కూడా అత్యంత క్రూరంగా చంపడం పలువురిని కలవరపాటుకు గురిచేసింది. ఈ వీడియో చూసి రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు అనేవాడు ఎవరు ఇలాంటి పని చేసి ఉండరు. ఇది ఎవరో ఉన్మాదే చేసి ఉంటాడు అని ఈ ఘటనను ఖండిస్తున్నారు.