Kanpur, OCT 22: ఒక కేసులో నేరస్తుడి కోసం వెతుకున్న పోలీసులు తప్పుగా మరో వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. (Mistaken Identity) పోలీసులు పేర్కొన్న వ్యక్తిని తాను కాదంటూ అతడు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అతడు అకారణంగా పది రోజుల పాటు జైలులో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ప్రమోద్ శంఖావార్ అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 24న కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఘటంపూర్ స్టేషన్ పోలీసులు ప్రమోద్ శంఖావార్‌కు బదులు వసంత్ విహార్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ సాహుకు (Pramod sahu) నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడి మొదటి పేరుతోపాటు తండ్రి పేరు ఒకటిగా ఉండటంతో కోర్టుకు హాజరుకాని నేరస్తుడు అతడేనని భావించారు.
అయితే పోలీసులు చెబుతున్న వ్యక్తిని తాను కాదని, తన తండ్రి జీవించి ఉన్నారని, వారు చెబుతున్నట్లుగా తన భార్య పేరు ఉషా కాదని సాహూ మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో పది రోజులపాటు జైలులో ఉన్నాడు. చివరకు తన ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో సెప్టెంబర్ 22న బెయిల్‌పై విడుదలయ్యాడు.
మరోవైపు ఈ అంశం పబ్లిక్ టాక్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ సాహును అరెస్ట్ చేసి జైలులో ఉంచిన పోలీస్ సిబ్బందిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని తప్పుగా గుర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) ఆనంద్ ప్రకాష్ తివారీ వెల్లడించారు.