
Pathanamthitta (Kerala) [India], July 31: దేశంలో తొలి మంకీ పాక్స్ మరణం నమోదైంది. కేరళలో మంకీ పాక్స్ వైరస్ (Monkeypox in India) బారిన పడిన యువకుడు శనివారం మృతి చెందాడు. నిజానికి ఆయన పది రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు రాగా.. అప్పటికే మంకీ పాక్స్ సోకి ఉందని, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతికి (Youth Dies With Monkeypox-Like Symptoms) కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీ పాక్స్ కారక మరణమేనని అధికారికంగా ప్రకటించకపోయినా.. దేశంలో ఇదే తొలి మంకీ పాక్స్ మృతిగా పేర్కొంటున్నారు.
జులై 21 తేదీన యూఏఈ నుంచి 22 ఏళ్ల యువకుడు కేరళలోని త్రిసూర్ కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో 27వ తేదీన స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మంకీ పాక్స్ లక్షణాలేమీ లేకపోవడంతో వైద్యులు సాధారణ చికిత్సలే అందించారు. అలా చికిత్స పొందుతూనే ఆరోగ్య పరిస్థితి విషమించి.. శనివారం మరణించారు. కానీ ఆ యువకుడు యూఏఈలో ఉన్నప్పుడే జులై 19వ తేదీనే మంకీ పాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.
ఆ రిపోర్టును కూడా వైద్యులకు ఇవ్వడంతో కలకలం మొదలైంది. దీంతో వైద్యులు ఆయనకు సంబంధించిన శాంపిళ్లను సేకరించి వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. సదరు యువకుడి మృతదేహానికి మంకీ పాక్స్ ప్రొటోకాల్ కు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ఐసోలేషన్ లో పెట్టారు. ఇక దేశంలో మంకీ పాక్స్ వైరస్ సోకిన తొలి వ్యక్తి శనివారమే పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడీ ఘటన జరగడం ఆందోళన రేపుతోంది.
శనివారం మరణించిన యువకుడిలో మంకీ పాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని.. ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. మంకీ పాక్స్ కొవిడ్ మాదిరిగా ప్రాణాంతకం కాదని.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నా.. మరణాల రేటు చాలా తక్కువని, ఆందోళన చెందవద్దని తెలిపారు. సదరు యువకుడికి మంకీ పాక్స్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు బయటపెట్టకపోవడంపై విచారణ జరుపుతామన్నారు.