Idukki: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లిపేరుతో వేధించి, యాసిడ్ దాడికి పాల్పడింది కేరళకు చెందిన ఓ మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో పెళ్లికి నిరాకరించాడు ఆ వ్యక్తి. దాంతో యువకుడిపై పథకం ప్రకారం యాసిడ్ దాడికి పాల్పడింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 35 ఏండ్ల షీబా, 28 ఏండ్ల అరుణ్ కుమార్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత తనను పెండ్లి చేసుకోమని అరుణ్‌కు షీబా ప్రపోజ్ చేసింది. అయితే షీబాకు ఇది వరకే పెండ్లి అయ్యిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అరుణ్‌కు తెలిసింది. దీంతో ఆమెతో పరిచయానికి ముగింపు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనతో చేసిన చాటింగ్ చూపించి అరుణ్‌ను బ్లాక్ మెయిల్ చేసింది షీబా.
ఈ నెల 16న అరుణ్ కుమార్ తన బావ, స్నేహితుడితో కలిసి ఆదిమాలి సమీపంలోని చర్చికు వెళ్లాడు. షీబా డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు ఆమెను అక్కడ కలిశాడు. అయితే పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన అరుణ్ ముఖంపై షీబా యాసిడ్ పోసింది. దీంతో అతడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆదిమాలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు అరుణ్. అనంతరం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అతడ్ని తరలించారు. యాసిడ్ దాడి వల్ల అరుణ్ కంటిచూపు పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు తెలిపారు.
అరుణ్‌పై యాసిడ్ పోసిన షీబా ముఖం, శరీరంపైనా యాసిడ్ పడటంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇదంతా చర్చిలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి షీబాను శనివారం అరెస్ట్ చేశారు.