Mumbai, November 26: ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 12 ఏళ్లు (Mumbai terror attack 12 years on) పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి అరేబియా సముద్రం మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఎన్నో వందల మందికి గాయాలూ అయ్యాయి. ఈ దాడి ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా (26/11 Mumbai Attacks) చరిత్రలో నిలువగా.. బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబీకుల్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు.
ఈ దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి, నేల రాలిన అమాయకులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని నగర పోలీసులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక చిహ్నంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది హాజరవుతారని ఓ అధికారి బుధవారం తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుభోధ్ కుమార్ జైస్వాల్, ముంబై పోలీసు కమిషనర్ పరమ్‌బిర్ సింగ్ ఇతర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు.తీర ప్రాంత రహదారి ప్రాజెక్టు కొనసాగుతున్న కారణంగా మెరైన్ డ్రైవ్ వద్ద ఉన్న పోలీస్ జింఖానా వద్ద ఉన్న స్మారకాన్ని పోలీసు ప్రధాన కార్యాలయానికి మార్చారు.
దేశంలోని ఎలైట్ కమాండో ఫోర్స్ అయిన ఎన్‌ఎస్‌జీతో సహా భద్రతా దళాలు 9 మంది ఉగ్రవాదులను ( Fighting Pakistani Terrorists) హతమార్చాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. లోపలి దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది.
ఒక్కసారిగా జరిగిన ఉగ్రదాడితో ఆర్థిక రాజధాని ముంబై భయంతో వణికిపోయింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అశువులు బాసారు. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను.. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్‌లో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు.
అయితే ముంబైలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్ లోనే జరిగింది. కానీ, దాయాదీ దేశం మాత్రం తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ మొండి వాదనను వినిపిస్తోంది. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి నడుస్తామని అమెరికా గురువారం ప్రకటించింది. 26/11 ముంబై ఉగ్రదాడి జరిగిన 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రకటన చేసింది. నేరస్థులను జవాబుదారీగా ఉంచడానికి, ఆరుగురు అమెరికన్లతో సహా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని యూఎస్ బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది.