Imphal, Aug 06: కొద్ది రోజులుగా మణిపూర్ (Manipur) మండుతోంది. రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య మే 3న ఏర్పడ్డ వివాదం మూడు నెలలుగా రాష్ట్రాన్ని కాలుస్తూనే ఉంది. అల్లర్లు, కాల్పులు, ఘర్షణలు, హత్యలు (Manipur) ఎంతకూ తగ్గుముఖం పట్టడం లేదు. సుమారు రెండు వందల మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది ఇంటిని వదిలేసి నిరాశ్రాయులయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తీసుకురావడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అయితే ఈ ఘర్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీకి అక్కడి స్థానిక పార్టీ బైబై (Withdraws Support) చెప్పడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో స్థానిక పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులో కుకీ పీపుల్స్ (Kuki People's Alliance) అలయన్స్ ఒకటి. అయితే తాజాగా బీజేపీకి బైబై చెప్పినట్లు కేపీఏ అధినేత తోంగమాంగ్ షౌకిప్ ఆదివారం రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఊకేకు లేఖ ద్వారా సమాచారం అందించారు. “ప్రస్తుత పరిస్థిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాం” అని గవర్నర్‌కు రాసిన లేఖలో హౌకిప్ పేర్కొన్నారు.
వాస్తవానికి 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో ఎన్డీయేకు 54 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే తాజాగా కుకీ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పటికీ 52 మంది ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి ఉంది. కాకపోతే, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. దేశవ్యాప్తంగా మణిపూర్ అంశం వైరల్ కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఇది ఓట్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.