Credit@ google

Hyderabad, May 15: మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ (Tea) లేదా కాఫీ (Coffee) తాగే అలవాటు ఉంటుంది. ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) స్పష్టం చేసింది. దేశంలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించేందుకు ఐసీఎంఆర్‌ ఇటీవల జాతీయ పౌష్ఠికాహార సంస్థ (NIN)తో కలిసి 17 సరికొత్త ఆహార మార్గదర్శకాలను జారీచేసింది. టీ, కాఫీని అధికంగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. వీటిలో ఉండే కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి టీ, కాఫీపై శారీరకంగా ఆధారపడే తత్వాన్ని పెంపొందిస్తుందని ఐసీఎంఆర్‌ (ICMR) పరిశోధకులు వివరించారు.

 

మనం సేవించే ప్రతి కప్పు (150 మిల్లీలీటర్ల) బ్రూవ్డ్‌ కాఫీలో 80 నుంచి 120, ఇన్‌స్టంట్‌ కాఫీలో 50-65, టీలో 30-65 మిల్లీగ్రాముల కెఫీన్‌ ఉంటుందని పేర్కొంటూ.. రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫీన్‌ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. భోజనం చేయడానికి గంట ముందు, భోజనం చేసిన తర్వాత టీ, కాఫీ తాగకూడదని, లేకపోతే వాటిలోని టానిన్లు మన దేహంలో ఇనుము శోషణ శక్తిని తగ్గిస్తాయని తెలిపారు. దీంతో ఐరన్‌ లోపం ఏర్పడి రక్తహీనత లాంటి సమస్యలకు దారితీస్తుందన్నారు. కాఫీని ఎక్కువగా సేవిస్తే అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అయితే, పాలు లేకుండా టీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు గుండె జబ్బులు, ఉదర క్యాన్సర్‌ ముప్పు తగ్గడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.