File image of Hafiz Saeed. (Photo Credits: PTI)

New York, September 26: అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన జమాత్-ఉద్-దావా చీఫ్ హఫిజ్ సయీద్ (Hafiz Saeed)  వ్యక్తిగత ఖర్చుల కోసం అతడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే వీలు కల్పించేలా తమకు అనుమతిని ఇవ్వండంటూ పాకిస్థాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. తన కుటుంబాన్ని కూడా పోషించుకునే స్థోమత లేక హఫిజ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, అతడి 'కనీస అవసరాల' కోసం నెలకు రూ. 1,50,000 (పాకిస్థానీ కరెన్సీ) డబ్బును వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ గత నెల ఆగష్టు 15న UNSCకి పాకిస్థాన్ లేఖ రాసింది.

అయితే పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తిపై నిర్ణీత గడువులోగా కమిటీ సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో, భద్రతామండలి ఈ విజ్ఞప్తిని ఆమోదించినట్లు యుఎన్ కమిటీ తన లేఖలో పేర్కొంది.

2008 ముంబై పేలుళ్లకు సంబంధించి ప్రధాన సూత్రధారి హఫిజ్ సయీద్.  ముంబైలో జరిగిన ఆనాటి పేలుళ్లలో  దాదాపు 160కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు, మరెంతో మంది కోలుకోలేనంతగా గాయపడ్డారు.  2012లో హఫిజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన అమెరికా, అతడిపై 10 మిలియన్ డాలర్ల రివార్డ్‌నూ ప్రకటించింది.  ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న హఫిజ్ బ్యాంకు ఖాతాలను నిలిపివేయాల్సిందిగా భద్రతామండలి తీర్మానం చేయడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం అతడి అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది, జూలై 17న అతడ్ని అరెస్ట్ చేసి లాహోర్ జైలులో ఉంచినట్లు ప్రకటించింది.  అయితే హఫిజ్ అరెస్టే ఒక పెద్ద "డ్రామా" అని భారత్ గతంలోనే

అభివర్ణించింది.

కాగా.. పాకిస్థాన్ తాజా విజ్ఞప్తితో, ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం అని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఒకవైపు తాము ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం అంటూనే, మరోవైపు ఉగ్రవాద నేతలను ఆదుకునేందుకు అది చూపిస్తున్న చొరవను గమనిస్తే  ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్ ఎన్ని కపట నాటకాలు ఆడుతుంది, ఎలాంటి రాజకీయాలు చేస్తుందనేది మరోసారి స్పష్టమైంది.