Mohan Bhagwat On Reservations Row: రిజ‌ర్వేష‌న్ల వివాదంపై తొలిసారి స్పందించిన‌ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ , హైద‌రాబాద్ వేదిక‌గా ఆయ‌న ఏమ‌న్నారంటే?
RSS chief Mohan Bhagwat (Photo-ANI)

Hyderabad, April 28: రిజర్వేషన్స్ వివాదం (Reservations Row) దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. రిజర్వేషన్స్ తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇందులోకి ఆర్ఎస్ఎస్ ను కూడా లాగింది. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ (RSS) వ్యతిరేకం అని, రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని, దాన్ని బీజేపీ అమలు చేయనుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విరుచుకుపడుతున్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి, రిజర్వేషన్లు ఎత్తివేయాలంటే బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

 

తాజాగా రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) స్వయంగా స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థంతోనే కొందరు నాయకులు ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని మోహన్ భగవత్ విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతిస్తుందన్నారు. రిజర్వేషన్లు ఎవరి కోసం కేటాయించారో వారి అభివృద్ధి జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. వివాదం సృష్టించి లబ్ది పొందాలని కొందరు అనుకుంటున్నారని, దాంతో తమకు సంబంధం లేదని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు.