Sabarimala Update:  శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప ఆలయం, ఇరుముళ్లతో ఆలయ సన్నిధికి చేరుకున్న అయ్యప్ప భక్తులు, ఆలయంలోకి ప్రవేశించే మహిళా కార్యకర్తలపై పోలీసుల ఆంక్షలు
Sabarimala Temple (Photo Credits: IANS)

Thrissur, November 16: నవంబర్ 17 నుంచి రెండు నెలల అయ్యప్ప తీర్థయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయం తెరుచుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందారు మహేష్ మోహనారారు గర్భగుడి ద్వారాలు తెరిచి ప్రత్యేక  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇరుముళ్లతో అయ్యప్ప దీక్షకులు స్వామి సన్నిధికి భారీగా తరలివచ్చారు. నేటి నుంచి డిసెంబర్ 27 వరకు నిత్య పూజలు కొనసాగనున్నాయి. ఆదివారం నుంచి భక్తులకు అనుమతిని ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

అయితే ఆలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.  ఆలయాన్ని సందర్శించే మహిళలు సంబంధిత కోర్ట్ ఉత్తర్వుతో రావాలని ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనానికి వచ్చిన కొంతమంది మహిళా భక్తులను పోలీసులు ప్రవేశ ద్వారం వద్దే నిలిపివేస్తున్నారు. విజయవాడకు చెందిన పది మంది మహిళా యాక్టివిస్టులు భక్తులుగా శబరిమల వెళ్లారు, వారిని పోలీసులు వెనక్కి పంపారు.

Latest Update From Sabarimala:

 

శబరిమలలో ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ గతేడాది 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును పున: సమీక్షించాల్సిందిగా దాఖలైన రివ్యూ పిటిషన్లపై గత గురువారం సుప్రీం కోర్ట్ తిరిగి విచారణ చేపడుతూ, శబరిమల సహా ఇతర అన్ని మతాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై విచారణ చేపట్టేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, 2018 నాటి తీర్పులో ఎలాంటి మార్పు చేయలేదు, దానిపై ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై వివాదం ఇంకా కొనసాగుతుంది. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులతో కేరళ ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.

నిన్నటికి నిన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ యాక్టివిజం ప్రదర్శించడానికి శబరిమలను ఎంచుకుంటామంటే కుదరదు, కొంతమంది మహిళా యాక్టివిస్టులు మీడియా ముందుకు వచ్చి మరీ తాము ఆలయంలోకి ప్రవేశిస్తాం, ఎవరు ఆపుతారో చూస్తాం అన్నట్లుగా ప్రకటనలిస్తున్నారు. అనవసర వివాదాలు సృష్టిస్తూ కేవలం ప్రచార యావ కోసమే ఆలయంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.