New Delhi, October 7: సీఎఎకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, సమావేశాల నిమిత్తమై బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. షహీన్‌బాగే (Shaheen Bagh Protests) కాదు.. ఎక్కడైనా ఇలా చేయడం సరికాదు. ఆ అడ్డంకులను తొలగించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
నిర్దేశించిన ప్రదేశాలలోనే నిరసన తెలియజేయాలి. ప్రజల రాకపోకలను సాగించే హక్కును నిరవధికంగా ఆపలేం. నిరసన తెలిపే హక్కు కచ్చితంగా ఉంటుంది. కానీ... కర్తవ్యాలను కూడా సమానంగా పాటించాలి. రోడ్లను వినియోగించుకునే హక్కు, నిరసన తెలిపే హక్కు తులనాత్మకంగా ఉండాలి.’’ న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
షాహీన్ బాగ్ నిరసనలతో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన రాకపోకలు
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ (Anti-CAA Protests) షహీన్‌బాగ్ ప్రాంతంలో నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిరసనలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందంటూ అమిత్ సాహ్ని అనే వ్యక్తి సుప్రీంలో పిల్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై విధంగా తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'కట్టర్ హిందూ ఏక్తా' పేరుతో ఉన్న ఈ గ్రూప్‌లో మెసేజులు, ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. మరో మతానికి వ్యతిరేకంగా ఈ గ్రూప్ పనిచేస్తోందని గుర్తించారు. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయాలని ఈ గ్రూప్ వేదికగా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలను సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచి కోర్టుకు నివేదించారు. ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న పెద్ద ఎత్తును మత ఘర్షణలు జరిగిన మరుసటి రోజే ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినట్టు పోలీసులు గుర్తించారు.
ఆ మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 751 ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. 1571 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 250 చార్జ్‌షీట్లు నమోదు చేసి 1153 మందిని నిందితులుగా చేర్చారు.