New Delhi, May 1: దేశంలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను సుప్రీంకోర్టు (Supreme Court ) ‘జాతీయ సంక్షోభం’గా అభివర్ణించింది. కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం (Center) అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి సమయాల్లో ఆక్సిజన్ తదితర అవసరాల కోసం ప్రజలు ఇంటర్నెట్‌లో, సోషల్‌మీడియాలో చేస్తున్న అభ్యర్థనలను తప్పుడు సమాచారంగా చిత్రీకరిస్తూ అధికారులు వారి నోరు మాయించటాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నేరంగా భావించడం తగదని కేంద్రంతోపాటు రాష్ట్రాల డీజీపీలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.
కొవిడ్ నియంత్రణకు (coronaVirus Control) జాతీయ విధానం అవసరమనే అంశాన్ని స్వయంగా చేపట్టి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు శుక్రవారం విచారణను కొనసాగించింది. కాగా సోషల్ మీడియాలో తప్పుడు అభ్యర్థనలు చేసిన వారిపై జాతీయ భద్రత చట్టం కింద చర్యలు తీసుకోవాలని యూపీ సర్కారు నిర్ణయించడం, ఆ రాష్ట్రానికే చెందిన ఒక బాలుడు ఆస్పత్రిలో ఉన్న తన తాతకు ఆక్సిజన్ సాయం కోసం సోషల్ మీడియా లో అభ్యర్థిస్తే అతడిపై పోలీసులు కేసు పెట్టడం వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో ప్రజల ఆక్రందనలు వినబడకుండా చేసే ప్రయత్నాలపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు, జస్టిస్ రవీంద్రభట్‌ల ధర్మాస నం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో సాయం కోసం ప్రజలు అభ్యర్థించడానికి ఆటంకాలు కల్పిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
‘ఇదొక జాతీయ సంక్షోభం. ఇంటర్నెట్‌లో లేవనెత్తే ఏ ఫిర్యాదైనా తప్పుడు సమాచారమేననే అభిప్రాయం సరైనది కాదు. ఈ రకమైన అణిచివేత చర్యలు ఇకపై కూడదని ధర్మాసనం హెచ్చరించింది. పేదలు ప్రైవేటుఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేసుకోలేరని, కాబట్టి ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది. కరోనా సంక్షోభం, నిర్వహణపై సుమోటో కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం పరిగణించాల్సిన ముఖ్యమైన విధాన మార్పులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, తగిన ఆదేశాలు రూపొందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది. ఆర్డరు ప్రతిని శనివారం ఉదయం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది. విచారణ సమయంలో కేంద్రాన్ని ధర్మాసనం పలు అంశాలపై ప్రశ్నించింది. వందశాతం వ్యాక్సిన్లు కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీసింది. శ్మశాన వాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా అందిస్తున్నారు? పేటెంటు చట్టాలు వర్తింపజేస్తున్నారా వంటి పలు ప్రశ్నలు ధర్మాసనం వేసింది.
ఢిల్లీ తరఫు న్యాయవాది డార్వా వాదనలు వినిపిస్తూ ఆక్సిజన్ కొరతపై మాట్లాడుతుండగా.. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీల్లో కొరత ఉందిగా అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అఫిడవిట్ సమర్పించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ అవసరాలు, కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. దీనిపై న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు.
దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 59 కోట్ల మందికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మార్కెట్ శక్తుల దయా దాక్షిణ్యాలకు వదిలేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. వారికి కూడా 45 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చినట్లే సబ్సిడీపై టీకా అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం జాతీయ టీకా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించింది.
ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు ఆసుపత్రులకు చేరడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.‘అఫిడవిట్‌లో సరైన ప్రణాళిక లేదు. వ్యాక్సిన్ అవసరం ఎంత? ఇంటర్‌నెట్ సదుపాయం లేనివారు, నిరక్షరాస్యులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు? వ్యాక్సిన్ డోసులను 100 శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకుంది?
నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి, పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా? వ్యాక్సిన్ తయారీదారులు డోసులను అందించే క్రమంలో ఎలా సమానత్వాన్ని ప్రదర్శించగలరు? 18–45 మధ్య దేశ జనాభా ఎంత అనేది కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలి.
ప్రైవేటు కంపెనీలకు కేంద్రం నిధులిచ్చి కేంద్రం చాలా కీలకమైన జోక్యం చేసుకుంది. వ్యాక్సిన్ తయారీదారులు ఈక్విటీని ఎలా నిర్ణయిస్తారు? అని ఆయన నిలదీశారు. ఈ సంక్షోభ సమయంలో కోర్టు జోక్యం అవసరమైన చోట ఆదేశాలు ఇస్తున్నామని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు తెలిపారు. ‘అమెరికా ప్రజలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తక్కువ ధరకే లభ్యం అవుతోంది. కానీ మనం ఎందుకు ఎక్కువ చెల్లించాలి’అని జస్టిస్ రవీంద్రభట్ అన్నారు.
టీకా కంపెనీలకు రూ.4500 కోట్లు ఇచ్చిన ప్పుడు వాటిపై ప్రభుత్వానికి కూడా నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘టీకా కంపెనీ వాళ్లు కేంద్రానికి రూ.150కి ఇస్తామని, రాష్ట్రాలకు 300-400కు ఇస్తామంటున్నారు. స్థూలంగా రూ.30-40 వేల కోట్ల తేడా వ స్తుంది. ఈ భారాన్ని దేశం ఎందుకు మోయాలి?’’ అని వ్యాఖ్యానించింది. అమెరికాలో 2.15 డాలర్లకు ఒక డోసు ఇస్తున్నారని, యూరప్ దేశాల్లో ఇంకా తక్కువ ధరకు ఇస్తున్నారని, భారత్‌లో రూ.600 ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది.
అత్యవసర పరిస్థితుల్లో పేటెంట్లను పక్కనబెట్టి ఔషధాల తయారీకి ఇతర కంపెనీలకు అనుమతించే అవకాశం ఉన్నా కేంద్రం ఎందుకు వినియోగించుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విపత్తు సమయంలో అత్యవసరంగా మారిన రెమ్‌డిసివిర్, టోసిలిజుమాబ్ లాంటి ఔషధాల తయారీకి ఇతర కంపెనీలకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
విదేశాల్లో పేటెంట్ కలిగి వున్న కంపెనీల మెడలు వంచి, జాతీయ అత్యవసర పరిస్థితిని కారణంగా చూపి, అవే తరహా మందులను భారత్‌లో తయారు చేయడానికి గతంలో అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా కంపెనీకి క్యాన్సర్ ఔషధం తయారీకి అనుమతి ఇవ్వడాన్ని ఉదాహరణగా చూపింది. బంగ్లాదేశ్ నుంచి లైసెన్స్ తీసుకుని రెమ్‌డెసివిర్‌ను ఇక్కడ భారీ ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు కదా? అని సూచించింది.
వైద్య రంగం పని ఒత్తిడితో కుప్పకూలే పరిస్థితి వచ్చిందని, రిటైరైన డాక్టర్లను, ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. దేశ రాజధానిలో దిగజారిన కొవిడ్ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయాలు పక్కనబెట్టి కేంద్రానికి సహకరించాలని సూచించింది. హాస్టళ్లు, గుడులు, చర్చిలను కొవిడ్ సెంటర్లుగా మార్చే అవకాశాన్ని పరిశీలించాలని పిలుపునిచ్చింది.
హైకోర్టులు విచారణ సందర్భంగా చేసే మౌఖిక వ్యాఖ్యానాల్లో సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని అనాలోచిత వ్యాఖ్యానాలు వ్యక్తులకు నష్టం చేయడమే కాకుండా, ప్రజల్లో వారిపట్ల దురభిప్రాయం కల్పించే అవకాశం ఉందని హెచ్చరించింది. సోషల్ మీడియా కాలంలో ప్రతీ మాటా ప్రజల్లోకి వెళుతుందన్న విషయాన్ని న్యాయమూర్తులు కూడా గుర్తెరగాలని, అనాలోచిత వ్యాఖ్యానాలు మానుకోవాలని సూచించారు.