Coronavirus in India: భారత్‌లో తొలిసారిగా ఒక్కరోజే 4 లక్షలు దాటిన కేసులు, 3,523 మంది మృతి, 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వాయిదా, కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కుంటున్న పలు రాష్ట్రాలు
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, May 1: భారత్‌లో రోజు వారీ కరోనా కేసులు 4లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,01,993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు అవగా..3,523 మంది మృతి చెందారు. 24 గంటల్లో డిశ్చార్జ్ ఆయిన వారి సంఖ్య 2,99,988గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969కి (Coronavirus Tally Nears 2 Crore) చేరింది. కోలుకున్న వారి సంఖ్య 1,56,84,406గా ఉంది. ప్రస్తుతం 32,68,710 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మొత్తం 2,11,853 మంది మృతి (Covid Deaths) చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 19,45,299 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ 30 నాటికి 28,83,37,385 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి.దీంతో 18-44 ఏండ్ల వయసువారికి వ్యాక్సినేషన్‌ను (మూడో దశను) శనివారం నాడు ప్రారంభించలేమని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. కాగా వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయిన విషయం విదితమే. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారు కేవలం రెండు రోజుల్లోనే కొవిన్‌ పోర్టల్‌లో 2.45 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

భారత్‌లో కరోనా విశ్వరూపానికి ఈ వైరస్సే కారణం, రెండు వైరస్‌ల కలయికతో పుట్టిన బి.1.617 వైరస్‌‌, 17 దేశాలను వణికించేందుకు రెడీ అయిన డబుల్ మ్యూటెంట్ కోవిడ్ వేరియంట్

ఈ నేపథ్యంలో సరిపడా వ్యాక్సిన్‌ డోసులు లేవని, శనివారం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద బారులు తీరవద్దని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. స్టాకు లేనందున మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ను నిలిపివేస్తున్నట్టు బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) గురువారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ డోసులు ఎప్పుడొస్తే అప్పుడు 18-44 వయస్కులకు టీకాలు వేస్తామని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ తయారీదారులు సకాలంలో సరిపడా వ్యాక్సిన్‌ను సరఫరా చేయలేదని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. 18-44 గ్రూపునకు వ్యాక్సినేషన్‌ను శనివారం ప్రారంభించడం లేదని తేల్చి చెప్పారు.

తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో సాధ్యపడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న 45 ఏండ్లు నిండినవారికి ఇంకా వ్యాక్సినేషన్‌కే మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుందని అన్నారు. ఇక ఒడిశాలో రెండో డోసు టీకా కోసమే ప్రజలు వారం పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బిహార్‌ ప్రభుత్వం కోటి వ్యాక్సిన్‌ వయల్స్‌ కావాలని కోరగా సీరం సంస్థ తిరస్కరించిందని, దీంతో మూడో దశను శనివారం ప్రారంభించలేమని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు.

ఇక గుజరాత్‌లోనూ వ్యాక్సిన్‌ డోసులు రావడానికి 15 రోజులు పడుతుందని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ తెలిపారు. వ్యాక్సిన్‌ సరఫరాపై కచ్చితమైన సమాచారం లేనందున 18-44 వయసువారికి వ్యాక్సినేషన్‌పై ఇంకా ప్రణాళిక ఖరారు చేయలేదని పంజాబ్‌ తెలిపింది. దీంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్‌, జమ్ము కశ్మీర్లో కూడా మూడోదశ వ్యాక్సినేషన్‌ను వాయిదా వేశారు.