Covid in India: తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, April 17: దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు (India Reports 2,34,692 New COVID-19 Cases) న‌మోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 1,75,649 మంది చ‌నిపోగా, 1,26,71,220 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 11,99,37,641 మంది క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇండియాలో కరోనా వైరస్ డబుల్ మ్యూటెంట్ చెంది మరింత ప్రమాదకరంగా (Coronavirus in India) మారిందని పేర్కొన్న బ్రిటన్ ఉన్నతాధికారులు, ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించడం కలకలం రేపింది. ఇండియాలో పుట్టిన కొత్త వేరియంట్ బ్రిటన్ కు కూడా వ్యాపించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ను తొలిసారిగా ఇండియాలోనే కనుక్కున్నారని పేర్కొన్న అధికారులు, దీనికి బీ1617 అని నామకరణం చేశామని, దీన్ని మరింతగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ కొత్త వైరస్ విషయంలో ఎపిడెమాలజిక్, ఇమ్యునోలాజికల్, పాథోజెనిక్ విభాగాలు విచారిస్తున్నాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) పేర్కొంది. ఏప్రిల్ 14 నుంచి ఇంగ్లండ్ లో 77 భారత్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని, స్కాట్లాండ్ లో సైతం కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్ తొలిసారిగా ఇండియాలోనే కనిపించింది. 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ తదితర వేరియంట్ల కలయికగా ఇది ఏర్పడింది. ఈ వైరస్ నియంత్రణకై కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం" అని పీహెచ్ఈ పేర్కొంది.

ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

కాగా, వీటిల్లో ఓ వేరియంట్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో వెలుగులోకి రాగా, మరో వేరియంట్ సౌతాఫ్రికా, బ్రెజిల్ లో కనిపించింది. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఇండియాలో సమ్మిళితమై ప్రపంచానికి వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఇప్పుడు మిగతా దేశాల కన్నా అత్యధికంగా 2 లక్షలకు పైగా కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయని గుర్తు చేసిన పీహెచ్ఈ, ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అరికట్టాల్సి వుందని అభిప్రాయపడ్డారు.

గాలి ద్వారానే వ్యాప్తి

ఇక ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తున్నదని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రఖ్యాత వైద్యపత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కూడా దీనిని ధ్రువీకరించింది. మహమ్మారి వ్యాప్తిలో సైలెంట్‌ ట్రాన్స్‌మిషన్‌ (గాలి ద్వారా వ్యాప్తి చెందడం) ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పరిశోధకులు తెలిపారు. ఇందుకు పది ఆధారాలను వారు పేర్కొన్నారు.

కరోనా సోకిన వ్యక్తి తుమ్మడం ద్వారా కరోనా

కరోనా సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడంతో పాటు శ్వాసించడం, మాట్లాడటం, అరవడం, పాడటం వంటి పనులు చేసినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశిస్తుంది. అది రెండు నుంచి మూడు మీటర్ల వరకు ఆవరించి ఉంటుంది. ఈ గాలిని పీల్చిన వారు మహమ్మారిబారిన పడతారు’ అని వెల్లడించారు. ప్రపంచ దేశాలను కరోనా చుట్టిరావడానికి ఈ సైలెంట్‌ ట్రాన్స్‌మిషనే కారణమని వాళ్లు పేర్కొన్నారు.

వచ్చే నాలుగు వారాల్లో వైరస్ ప్రమాదకరంగా మారే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు, దేశంలో తాజాగా 1,15,736 మందికి కరోనా, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి

పెద్ద తుంపర్ల ద్వారా వైరస్‌ సులభంగా వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. ‘కేసులు పెరుగడానికి గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ప్రధాన కారణం’ అని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో శాస్త్రవేత్త జోస్‌ లూయిస్‌ జిమ్‌నెజ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఇండ్లల్లో ఉన్నప్పుడు కూడా నాణ్యమైన మాస్కులను ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం, వెంటిలేషన్‌, ఎయిర్‌ఫిల్టరేషన్‌ ఉన్న గదులను వినియోగించడం, రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది హైగ్రేడ్‌ పీపీఈ కిట్లను వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సెకండ్‌ వేవ్‌ అత్యంత ప్రమాదకరం

గతేడాదితో పోలిస్తే, ఈ సెకండ్‌ వేవ్‌ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నవజాత శిశువు మొదలుకొని ఐదేండ్ల చిన్నారి వరకు అందరూ మహమ్మారి బాధితులుగా మారుతున్నట్టు చెబుతున్నారు. కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా ఉన్నదని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్‌ ధీరన్‌ గుప్తా అన్నారు. ఈసారి పిల్లల్లో కూడా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి వైద్యురాలు, అత్యవసర విభాగం చీఫ్‌ డాక్టర్‌ రితూ సక్సేనా తెలిపారు. ‘పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్ల చిన్నారికి కూడా మహమ్మారి సోకుతున్నది.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

ఇప్పటికే వైరస్‌ లక్షణాలతో ఏడెనిమిది మంది పిల్లలు మా ఆస్పత్రిలో చేరారు’ అని సక్సేనా పేర్కొన్నారు. రెండో విడుతలో తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ర్టాలు- మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీలలో మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య 80వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత మరింత ఎక్కువగాకేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, శ్వాస సంబంధిత సమస్యలు తొలి, రెండో దశల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే రెండో దశలో మాత్రం పలు కొత్త లక్షణాలను వైద్యులు గుర్తించారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం, నీళ్ల విరేచనాలు, వినికిడి సమస్య తదితర లక్షణాలు ప్రస్తుతం రెండో దశలో కనిపిస్తున్నట్టు తెలిపారు.

రెండోసారి కరోనా బారిన బీఎస్‌ యెడ్డ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్డ్యూరప్ప రెండోసారి కరోనా బారినపడ్డారు. ఎనిమిది నెలల కిందట ఆయనకు కరోనా రాగా, శుక్రవారం మరోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 78 ఏండ్ల యెడియూరప్ప.. వైద్యుల సూచన మేరకు చికిత్స కోసం ఒక ప్రైవేటు దవాఖానలో చేరారు. గతేడాది ఆగస్టులో యెడియూరప్పకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో దవాఖానలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. గత నెలలో ఆయన కరోనా వ్యాక్సిన్‌ తొలి డోస్‌ వేసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కూడా కరోనా సోకింది.

కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా మరణం

సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్‌ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1974 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రంజిత్‌ సిన్హా 2012లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

జూన్ నాటికి ప్ర‌తి రోజు 2,320 క‌రోనా మ‌ర‌ణాలు

దేశంలో జూన్ నాటికి ప్ర‌తి రోజు 2,320 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌వుతాయ‌ని లాన్‌సెట్ క‌రోనా క‌మిష‌న్ తెలిపింది. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఆందోళ‌న క‌లిగిస్తున్న నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి కార‌ణాల‌ను గుర్తించి నియంత్ర‌ణ‌కు అత్య‌వ‌స‌ర‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. భార‌త టాస్క్‌ఫోర్స్ స‌భ్యులున్న ఈ క‌మిటీ దేశంలో క‌రోనా రెండో ద‌శ‌పై అధ్య‌యనం చేసింది. ఫిబ్ర‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు 40 రోజుల్లో దేశ‌వ్యాప్తంగా రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 10,000 నుంచి 80,000కు పెరిగిన‌ట్లు తెలిపింది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఈ సంఖ్య చేరేందుకు 83 రోజుల సమ‌యం ప‌ట్టింద‌ని వెల్లడించింది.

చండీగఢ్‌లో యూకే రకం వైరస్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ.. చండీగఢ్‌లో యూకే రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం నమూనాలను ఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించి పరీక్షించగా వాటిలో 70 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరో 20 శాతం నమూనాల్లో 681 హెచ్ మ్యూటెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఒక్క నమూనాలో మాత్రం డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించినట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) డైరెక్టర్ జగత్ రామ్ పేర్కొన్నారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.

ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా

క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. గ‌త ఏడాది విజృంభించిన ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తున్న‌ది. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న‌ది. గ‌త నాలుగు రోజుల నుంచి రోజూ రెండు ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే ఫస్ట్ వేవ్ సంద‌ర్భంగా ఏనాడూ ఒకేరోజు ల‌క్ష కేసులు న‌మోదు కాలేదు. అయినా ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం లాంటి నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించారు.

మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

కానీ ఇప్పుడు రోజూ రెండు ల‌క్ష‌ల‌కుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అయినా ప్ర‌జ‌లు య‌థేచ్చ‌గా తిరుగుతున్నారు. కొంద‌రైతే మాస్కులు కూడా ధ‌రించ‌డం లేదు. అయితే ప్ర‌భుత్వాలు కూడా సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, బార్‌లు, రెస్టారెంట్‌లు స‌హా అన్ని ర‌కాల వ్యాపార కార్య‌క‌లాపాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. దానివ‌ల్ల కూడా వివిధ సంస్థ‌ల్లో ప‌నిచేసే సిబ్బంది, వినియోగ‌దారులు ఇండ్ల నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారు. అంద‌రూ అన్ని జాగ్ర‌త్త‌ల‌తో బ‌య‌ట‌కి వ‌స్తే ప్ర‌మాదం లేదుగానీ కొంద‌రు మాత్రం మాస్కులు, సామాజిక దూరం అనే నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతున్నారు.

సెకెండ్ వేవ్‌ కొవిడ్‌ బాధితుల్లో కొత్తకొత్త‌ లక్షణాలు

కొత్త కేసులు అంత‌కంత‌కే పెరిగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొంత‌మంది క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌పై నిర్ల‌క్ష్యంగా ఉండ‌ట‌మే. ఇదిలావుంటే సెకెండ్ వేవ్‌ కొవిడ్‌ బాధితుల్లో కొత్తకొత్త‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఉంటున్నాయి. క‌ళ్లు ఎర్ర‌బార‌డం కూడా కొంద‌రిలో క‌రోనా ల‌క్ష‌ణంగా ఉంది. క‌ళ్ల ద్వారా కూడా వైర‌స్ చేర‌డం వ‌ల్ల‌నే క‌ళ్లు ఎర్ర‌బారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ‌స్ట్ వేవ్‌లో క‌రోనా పసివాళ్లు, వృద్ధుల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం చూప‌గా సెకండ్ వేవ్‌లో మాత్రం యువ‌త‌పైనే క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ది. క‌రోనా బారినప‌డిన వాళ్ల‌లో 20 నుంచి 25 శాతం మంది యువ‌త మాత్ర‌మే ఉంటున్నారు. 20 నుంచి 35 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారికే క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా సోకుతున్న‌ది.