Image used for representational purpose only (Photo Credits: Getty)

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సైనికుడి దుస్తులు, కెమెరా ఉన్న హెల్మెట్ ధరించి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. తుపాకీతో సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్యలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతి విద్వేషమే కారణమని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

నిందితుడు న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ జెండ్రాన్‌గా గుర్తించారు. ఇతను 11 మంది నల్ల జాతీయులను, ఇద్దరు తెల్ల జాతీయులను కాల్చినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు.