Lucknow, SEP 06: ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే అపహరించాడు (Steals Shivling). ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది. కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి రోజు స్థానికంగా ఉన్న భైరవ బాబా టెంపుల్‌కు వెళ్లేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని చోటూ ప్రార్థించేవాడు. అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు (prayes) చేశాడు చోటూ. చివరకు అమ్మాయి దొరక్కపోవడంతో.. అసహనానికి గురైన చోటూ ఆగస్టు 31న శివలింగాన్ని అపహరించాడు. అయితే శివలింగం కనిపించకపోవడంతో మిగతా భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. భక్తులను విచారించారు. చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు చోటూ. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.