Nandadevi glacier (Photo Credits: Wikipedia)

Dehradun, Feb 8: ప్రకృతిని నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ఎన్నో ఘటనలు మానవులు చవి చూశారు. తాజాగా ఉత్తరాఖండ్ మంచు చరియలు విరిగిపడిన ఘటన (Uttarakhand Glacier Burst) ప్రకృతి ఎంతలా మానవునిపై పగబట్టిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమాలయాలకు తీవ్ర ముప్పు వాటిళ్లుతోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా మంచు కొండలు కరిగిపోతున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయ పర్వతాలపై ఉన్న హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి.

పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ ప్రాంతంలో పర్యావరణ సమతౌల్యం దెబ్బతినేలా ఎలా పడితే అలా భారీ నిర్మాణాలు చేపట్టడం వంటి పనులు చేపట్టకూడదని.. కానీ ఇప్పుడక్కడ జరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఉత్తరాఖండ్‌ గ్లేషియల్‌ లేక్‌ అవుట్‌ బరస్ట్‌ ఫ్లడ్‌ (జీఎల్‌వోఎఫ్‌) ద్వారా ఇలాంటి ఉత్పాతాన్నే చూసింది. అది భూతాపం వల్లనే సంభవించిందని పరిశోధకులు అప్పట్లో చెప్పారు. తాజాగా మరో ప్రళయం దేవభూమిని వణికించింది.

నందాదేవి పర్వతంపై జరిగిన ‘గ్లేషియర్‌ బరస్ట్‌’ (Nanda Devi Glacier) వల్ల వరద పోటెత్తింది. మరి ఈ గ్లేషియర్‌ బరస్ట్‌ అంటే ఏమిటో చాలామందికి తెలియకపోవచ్చు. సాధారణంగా మంచు పర్వతాలపై ఉండే హిమనీ నదాలను గ్లేసియర్స్‌ అంటారు. మన గంగానది సహా.. ప్రపంచంలో చాలా నదులకు ఈ హిమనీనదాల నుంచి వచ్చే నీరే ఆధారం. ఈ హిమనీనదాల్లో ఉండే మంచు గడ్డల లోపలి భాగాల్లో నీరు ప్రవహిస్తుంటుంది. లోపల నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మంచుగడ్డ ఒక్కసారిగా పగులుతుంది. ఆ ఊపుకు లోపలి నుంచి నీరు ఉధృతమైన వేగంతో ఒక్కసారిగా బయటకు దూకుతుంది. దీన్నే గ్లేసియర్‌ బరస్ట్‌ (Uttarakhand Glacier) అంటారు.

దేవభూమిలో అసలేం జరిగింది? మృత్యుఘోషకు కారణాలు ఏంటీ? ఇంకా కానరాని 170 మంది ఆచూకి, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఉత్తరాఖండ్ విలయంపై ప్రత్యేక కథనం

ఈ నీరు ఎందుకు కరుగుతుందంటే.. పర్యావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జరుగుతూ ఉంటుంది. నిజానికి హిమాలయాల్లోని మంచునదులకు ఈ తరహా ముప్పు ఉందని పేర్కొంటూ సరిగ్గా ఏడాది క్రితం ఒక అధ్యయన నివేదిక వెలువడింది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగితే చాలు.. 2100 నాటికి ‘హిందుకుష్‌ హిమాలయన్‌ (హెచ్‌కేహెచ్‌) ప్రాంతం’లోని హిమనీనదాలు మూడో వంతు మేర కరిగిపోతాయని ఆ నివేదిక హెచ్చరించింది.

హిందుకుష్‌ హిమాలయన్‌ ప్రాంతం అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మియన్మార్‌, చైనా దేశాల్లో 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన సువిశాల ప్రాంతం. దీన్ని ‘థర్డ్‌ పోల్‌ (మూడో ధ్రువం)’గానూ వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ధ్రువాల తర్వాత మంచినీరు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ హిందుకుష్‌ హిమాలయన్‌ ప్రాంతమే. అలాగే ప్రపంచపు అత్యంత ముఖ్యమైన నీటి బురుజుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తారు.

ఎందుకంటే.. ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలం ఈ ప్రాంతం. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఉండగా.. కోట్లాది మందికి ఇవి ప్రాణాధారంగా ఉన్నాయి. హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్‌, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలధారంగా ఉన్నాయి. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది.

అకస్మాత్తు వరదలతో ఉత్తరాఖండ్ విలవిల, తొమ్మిది మృత‌దేహాలు వెలికితీత, 150 మంది గల్లంతు, పూర్తిగా కొట్టుకుపోయిన రుషి గంగ పవర్ ప్రాజెక్టు,తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు

ఎనిమిది దేశాల్లోని దాదాపు 180 కోట్ల మందికి నీటి అవసరాలు తీర్చే ప్రాంతమిది. అంతేకాదు.. ప్రపంచంలోని నాలుగు జీవ వైవిధ్య హాట్‌స్పాట్లలో ఇదీ ఒకటి. హెచ్‌కేహెచ్‌ ప్రాంతంలోని హిమనీనదాలన్నీ 7 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని అంచనా. అప్పటి నుంచి 1970 దాకా వాటికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ.. ఆ దశకంలో మొదలైన భూతాప సమస్య శ్రుతి మించుతుండడంతో హిమనీనదాలు కరగడం ప్రారంభమైంది.

కాగా హిమనీ నదాల తిరోగమనం నుంచి ఏర్పడిన అస్థిర సహజ ఆనకట్ట వల్ల మంచు చరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. హిమానీ నదాలు మంచు కదిలే పెద్ద భాగాలు.. కాబట్టి, హిమానీనదం వెనక్కి మళ్లినప్పుడు, భూమిలోపలికి వెళ్లి నీటితో నిండిన ఒక సరస్సు ఏర్పడుతుంది. కెనడాకు చెందిన కాల్గరీ యూనివర్సిటీ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. దీనిని మొరైన్ అని పిలుస్తారు, ఇది శిథిలాలు, కూరుకుపోయి మంచుతో ఏర్పడతాయి. నీటి మట్టం పెరగడం, హిమానీనదం వెనక్కి తగ్గడంతో మొరైన్‌లు బలహీనపడతాయి. సరస్సు నుంచి వచ్చిన ఒత్తిడితో కూలిపోయినప్పుడు భారీ వరదలకు దారితీస్తుంది.

ప్రకృతి విధ్వంసం ఇలాగే జరుగుతూ ఉంటే ముందు ఇంకా పెను ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో పౌరీ, తెహ్రీ, రుద్ర ప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ తదితర జిల్లాలకు ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.