Washington, February 16: వైద్య ప్రపంచంలో మరో మిరాకిల్ చోటు చేసుకుంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో అశావహ ముందడుగు పడింది. లుకేమియాతో బాధపడుతున్న ఓ యుఎస్ మహిళా పేషెంట్ ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌కు సహజంగా నిరోధకతను కలిగి ఉన్న దాత నుండి స్టెమ్ సెల్ మార్పిడిని స్వీకరించిన తర్వాత ఆమె పూర్తిగా HIV నుండి కోలుకుంది. ఇలా ప్రపంచంలో కోలుకున్న మూడవ వ్యక్తిగా (Woman Cured of HIV) నిలిచారని పరిశోధకులు తెలిపారు.
వివరాల్లోకెళితే.. అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి (Leukaemia Patient in US Becomes First Woman) పొందారు. 'రెట్రోవైరస్లు-అంటువ్యాధులు'పై మంగళవారం నిర్వహించిన సందస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డ్ స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో హెచ్‌ఐవీ నుంచి విముక్తి ( Cured of HIV Using Stem Cell Transplant,) పొందవచ్చని నిర్ధారణకు వచ్చినట్టు వారు ప్రకటించారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, మెటర్నల్ పీడియాట్రిక్ ఆడోలెసెంట్ ఎయిడ్స్ క్లినికల్ ట్రయల్ నెట్వర్క్ (ఇంపాక్ట్), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కేసులో పరిశోధన సాగించారు. ఇంపాక్ట్ సంస్థ 2015 నుంచి మొత్తం 25 మంది హెచ్‌ఐవీ బాధితులపై పరిశోధనలు సాగిస్తోంది.
ఆ మహిళకు(64) 2013లో హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతూ, యాంటీరిట్రోవైరల్ థేరపీ (ఏఆర్టీ) తీసుకుంటోంది. నాలుగేళ్ల తర్వాత ఆమె ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా(మూలుగలో రక్తకణాలను తయారుచేసే కణాల్లో వచ్చే కేన్సర్) బారిన పడింది. దీంతో ఈ రెండింటికీ చికిత్స చేయడానికి అవసరమైన మూలకణాలు గల దాత కోసం వైద్యులు ఎదురుచూశారు. సదరు దాతకు హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(హెచ్‌ఎల్)తో పాటు, సహజ హెచ్‌ఐవీ నిరోధకంగా పేర్కొనే సీసీఆర్5-డెల్టా 32 మ్యుటేటెడ్ జన్యువు కూడా ఉండాలి.
ఈ మ్యుటేటెడ్ జన్యువు చాలావరకూ ఉత్తర యూరోపియన్ మూలాలున్నవారిలో మాత్రమే ఉంటుంది. అలాంటి దాత దొరకగానే వైద్యనిపుణులు న్యూయార్క్ మహిళకు చికిత్స చేపట్టారు. తొలుత దాత నుంచి సేకరించిన బొడ్డుతాడు మూలకణాలను మార్పిడి చేశారు. ఆ మర్నాడు.. ఆమె బంధువు నుంచి సేకరించిన మూలకణాలను(అడల్ట్ స్టెమ్‌సెల్స్) కూడా ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టారు. ఇదంతా 2017లో జరిగింది. చికిత్స జరిగిన 37 నెలల తర్వాత ఎయిడ్స్‌కు యాంటీ రెట్రో వైరల్ ఔషధాల వాడకాన్ని ఆపేసింది. ఇప్పటికి 14 నెలలుగా ఆమె ఆ మందులు వాడకున్నా.. ఆమె శరీరంలో హెచ్‌ఐవీ ఆనవాళ్లు లేవని వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇలా ఇద్దరు పేషెంట్లు మూలుగ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందారు. కీమో థెరపీ ద్వారా తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా నుంచి కూడా ఆమెకు ఉపశమనం లభించడం విశేషం.
స్టెమ్‌సెల్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అంటే ఏమిటి?
స్టెమ్‌సెల్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స ఖరీదైనది. ఈ చికిత్సలో స్టెమ్‌సెల్స్‌ను అందరూ దానం చేయడం కుదరదు. రక్త కణాల్లో హెచ్‌ఐవీ వైరస్‌ను బంధించే గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉండని వ్యక్తిని దాతగా అంగీకరిస్తారు. అప్పుడు రోగి శరీరంలోకి ఎక్కించిన దాత స్టెమ్‌సెల్స్ నూతన రక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త కణాలు హెచ్‌ఐవీ నిరోధకాలుగా ఉంటాయి. దీంతో సదరు రోగిలో క్రమంగా వైరస్ లోడు తగ్గిపోతుంది. అయితే ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్టులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం అతిపెద్ద సమస్య. తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈ దఫా మహిళా పేషెంటులో ఈ సమస్య కనిపించలేదు. దీంతో మరోమారు ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై ఆశలు పెరిగాయి.