(Photo Credits: File Image)

హిందువులలో ఎక్కువ మంది ఇప్పటికి నిత్య పూజా విధానాన్ని పాటిస్తుంటారు. అందులోనూ శుక్రవారం నాడు అయితే స్త్రీలు లక్ష్మీ దేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అయుతే శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ స్త్రీలు ఇలా పూజను చేసినట్లైతే ఇక మీ ఇంట సిరులపంటే. ఇప్పుడు శుక్రవారం ఎలా పూజను చేసినట్లయితే ఆ శ్రీమహాలక్ష్మికి అనుగ్రహాన్ని పొందుతామో ఇపుడు చూద్దాం. ముందుగా గృహిణిలు తెల్లవారు జామునే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి లోపల, వెలుపల పసుపు నీళ్లు చిలకరించాలి. స్త్రీలు నుదుటిన కుంకుమ, పాదాలకు పసుపు, చేతిలో గాజులు తప్పని సరిగా ఉండాలి. పూజ మందిరంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ ప్రత్యేకించి పసుపు కుంకుమలు గంధం పుష్పాలతో అలంకరించాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన ముగ్గును వేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి, మహాలక్ష్మిని ధ్యానిస్తూ అక్షింతలను అమ్మవారి పై వేసి నమస్కరించుకోవాలి. అమ్మవారి వద్ద కమలాలను, తులసి దళాలను కూడా ఉంచాలి. తదుపరి దీపారాధన చేసి అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పుష్పాలను అమ్మవారిపై వేయాలి.

"ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే"

అదే విదంగా తులసి కోటను అలంకరించి తులసి కోట వద్ద ముగ్గును వేసి దీపారాధన చేయాలి. చివరగా హారతి ఇచ్చి అనంతరం అమ్మ వారిని తలుచుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ ఎప్పుడూ కుడి వైపు నుండి ఎడమ వైపుకు చేయాలి. అనంతరం మీ కోర్కెలను లక్ష్మీ మాతతో విన్నవించుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకా శుక్రవారం అమ్మవారి వ్రతం చేపట్టిన అధ్బుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అమ్మవారి ప్రసాదాన్ని మన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఇతరులకు పంచిన పుణ్యం లభిస్తుంది. శుక్రవారం ఎపుడు కూడా ఇల్లు ఎంతో పరిశుభ్రంగా కళకళలాడుతుండాలి.