
సంవత్సరంలో జరుపుకునే నాలుగు నవరాత్రులలో శారద నవరాత్రి అత్యంత ప్రాచుర్యం పొందింది. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, నవరాత్రి సమయంలో ఉపవాసం, సాత్విక ఆహారాలు తీసుకోవడం ప్రాచుర్యం ఉంది. భక్తులు మొత్తం 9 రోజుల పాటు లేదా కొన్ని రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు.
నవరాత్రుల్లో భక్తులు దుర్గామాతను పూజిస్తారు. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2, 2025 వరకు జరగనున్నాయి. తెలంగాణలో ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారు. భక్తులు తొమ్మిది రోజులపాటు పూలతో బతుకమ్మను అల్లుతూ, ఆచారాలను పాటిస్తూ దగ్గరలోని చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు తొమ్మిది రోజులపాటు దుర్గామాత అవతారాలను దర్శించడానికి తరలి వస్తారు.
ఈ సంవత్సరం ఉత్సవం 10 రోజులుగా ఎందుకు?
పండితులు చెప్పినట్లుగా.. సాధారణంగా నవరాత్రి 9 రోజులుగా జరుపబడుతుంది, కానీ ఈసారి 10 రోజులుగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సెప్టెంబర్ 24, 25 తారీఖుల్లో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం.ఫలితంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక రోజు పొడిగించడం జరిగింది. ఈ ఉత్సవాలు విజయదశమి (దసరా) పండుగతో అక్టోబర్ 2న ముగుస్తాయి ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం ప్రారంభం కావడం విశేషం. భక్తులు నమ్మకం ప్రకారం, ఈ సందర్భంగా దుర్గామాత ఏనుగుపై భూమి మీదకు వస్తారని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇది శుభ సూచకంగా పరిగణించబడుతుంది.
దుర్గాదేవి పూజ:
శారద నవరాత్రిలో ముఖ్యంగా దుర్గాదేవి పూజ జరుగుతుంది. పండుగ ఆరవ రోజు నుండి పదవ రోజు వరకు భక్తులు దేవతకు వీడ్కోలు పలికే వరకు పూజ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, త్రిపుర, జార్ఖండ్, అస్సాం, తూర్పు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో దుర్గాదేవి పూజ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
శారద నవరాత్రి తేదీలు, కారణం:
శారద నవరాత్రి అశ్విన మాసంలో వస్తుంది. ‘శారద’ అనే పదం శరదృతువుకు (సెప్టెంబర్ మధ్య నుండి నవంబర్ మధ్య) సంబంధించినది. సాధారణంగా, నవరాత్రి 9 రోజులపాటు జరిగి దసరా లేదా విజయదశమితో ముగుస్తుంది.
నవరాత్రి 2025 పూర్తి క్యాలెండర్
సెప్టెంబర్ 22- ఘటస్థాపన, శైలపుత్రి పూజ - తెలుపు రంగు
సెప్టెంబర్ 23 - బ్రహ్మచారిణి పూజ - ఎరుపు రంగు
సెప్టెంబర్ 24 - చంద్రఘంట పూజ - రాయల్ బ్లూ రంగు
సెప్టెంబర్ 25 - కాత్యాయిని పూజ - పసుపు రంగు
సెప్టెంబర్ 26 - కూష్మాండ పూజ - ఆకుపచ్చ రంగు
సెప్టెంబర్ 27 - స్కందమాత పూజ - బూడిద రంగు
సెప్టెంబర్ 28 - కాత్యాయిని పూజ - నారింజ రంగు
సెప్టెంబర్ 29 - కాళరాత్రి పూజ - నెమలి ఆకుపచ్చ రంగు
సెప్టెంబర్ 30 - దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ - పింక్ రంగు
అక్టోబర్ 1 -మహానవమి - బంగారం రంగు
ప్రతి రోజు భక్తులు ప్రత్యేక రంగులో దుస్తులు ధరించి, ఆ రోజుకు అనుగుణంగా పూజలో పాల్గొంటారు. 10వ రోజు మహానవమి పండుగలో ప్రధానంగా విజయదశమి వేడుకలతో ముగుస్తుంది.