
Sri Sri Birth Anniversary | నేడు శ్రీశ్రీ జయంతి, ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల జీవితాలు అల్లకల్లోలమై హంగ్రీ థర్టీస్ గా పిలువబడిన 1930 దశకంలో…. అంటే 1934 నుంచి 1940 వరకూ తాను రాసిన కవితల్లోని ఉత్తమమైన, మానవజాతి ఎదుర్కొంటున్న బాధల గురించి, క్రొత్తగా వెలువడాల్సిన సాహిత్యం గురించి వ్రాసిన కవితలతో ఓ కవితా సంకలనం ప్రచురించారు. 1950లో “మహాప్రస్థానం” పేరిట ప్రచురించిన ఈ కవితా సంకలనం అత్యున్నత స్థానంలో నిలిచి ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీని(Srirangam Srinivasarao) మహాకవి చేసింది.
తరువాత ఖడ్గ సృష్టి, మరోప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి, గర్జించు రష్యా మొదలైన రచనలు మార్క్సిజం దృక్పథంతో సామాజిక వాస్తవికతను స్పృశించిన రచనల్లో ముఖ్యమైనవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను శ్రీశ్రీ సొంతం చేసుకున్నారు.

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి

ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి

రణరంగం కానీ చోటు భూ
స్తలమంతా వెదకిన దొరకదు :
గతమంతా తడిసె రక్తమున ,
కాకుంటే కన్నీళ్లతో .
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి

ఏది తెలుపు, ఏది నలుపు
ఏది గానం, ఏది మౌనం
ఏది నాది, ఏది నీది
ఏది నీతి, ఏది నేతి
నిన్న స్వప్నం, నేటి సత్యం
నేటి ఖేదం, రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహాత్మా , ఓ మహర్షి

ఏది చీకటి, ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం, ఏది పాపం
ఏది నరకం, ఏది నాకం
ఏది సత్యం, ఏదసత్యం
ఏదనిత్యం, ఏది నిత్యం
ఓ మహాత్మా , ఓ మహర్షి