Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

TTD Kalyanam In USA: అమెరికాలో స్థిరపడిన తెలుగువారి కోసం ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకూ శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండున్నరేళ్లుగా కరోనా కారణంగా ఇతర ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమలకు రాలేకపోతున్నారని, అందువల్ల అక్కడే శ్రీవారి కల్యాణాలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అమెరికాలో శ్రీవారి కల్యాణాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో శ్రీవారి కల్యాణాలను నిర్వహిస్తామని చెప్పారు. మిగిలిన దేశాల నుంచి కూడా తమ దేశాల్లో కల్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం ప్రచారం చేయడానికి టీటీడీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను అనుసరించి అన్ని దేశాల్లో స్వామి వారి కల్యాణాలను నిర్వహిస్తామని చెప్పారు. భక్తులందరూ ఉచితంగా కల్యాణాల్లో పాల్గొనవచ్చని తెలిపారు.