మేష రాశి Mesha rashi Ugadi panchangam

మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదము (చూ,చే, చో, ల, లీ, లూ, లే, లో, ఆ) ఆదాయం 8, వ్యయం: 14- రాజపూజ్యం : 4, అవమానం: 3

వీరికి ఈ సంవత్సరమంతయు ఏకాదశమందు శని అనుకూలుడు కావున సర్వము అనుకూలించును, సకల కార్యములయందు లాభము, జయము, ప్రోత్సాహము కలుగును, ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజనులలో మోదము కలుగును. గురువు చైత్రమున జన్మమందుండుటచే కొన్ని బాధలు తాత్కాలికముగ కలిగిననూ, మాసాంతము నుండి సంవత్సరాంతము వరకు ద్వితీయగురువు అయినందున ధనసంపాదన, సుఖము, కీర్తిప్రతిష్టలు, మాటగౌరవము పొందుట జరుగును. శుభమూలక ధనవ్యయము, సంతోషము కలుగును.

సంవత్సరమంతయు వ్యయరాహువు మరియు షష్టకేతువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. ఆశ్వయుజ బహుళం నుండి నాలుగు మాసములు అర్దాష్టమ కుజుడు కనుక ప్రయాణాదులయందు, వాహనముల విషయములో జాగ్రత్త అవసరము.

అశ్విని వారికి, చైత్ర శుక్ల సప్తమి నుండి భాద్రపద శుక్ల దశమి వరకు, తిరిగి పుష్య శుక్ల పూర్ణిమ నుండి సంవత్సరాంతము వరకు నైధనతారయందు శని సంచారము కలదు. ఆశ్వయుజ, మాఘ మాసములయందు నైధనతారయందు. కుజుడు సంచరించుచున్నందున జాగ్రత్త అవసరము. భరణి వారికి ఆషాఢము నుండి ఫాల్గున శుక్లం వరకు వైధనతారయందు రాహువు సంచరించును.

కార్తిక మార్గశిర పుష్యమాసములందు కుజుడు నైధనతారయందుండును. కృత్తిక వారికి, సంవత్సరారంభమున మూడు మాసములు నైధనతారయందు రాహువు మరియు కార్తిక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. కావున వారు ఆయా సమయములలో ఆయా గ్రహములకు శాంతియొనర్చిన మేలు. దుర్గాసప్తశతి పారాయణము, సుబ్రహ్మణ్య దేవతారాధన వీరికి శ్రేయోదాయకములు.