Ganesh-jayanti 2024 | File Photo

Vinayaka Jayanti 2024: మాఘ మాసంలో వచ్చే శుక్ల చతుర్థిని హిందువులకు ఒక పర్వదినం. దీనినే మాఘ శుక్ల చతుర్థి, తిల్కుండ్ చతుర్థి లేదా వరద్ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ మాఘ మాసంలో శుక్లపక్ష చతుర్థిని వినాయక జయంతిగా జరుపుకుంటారు. మరో సంప్రదాయం ప్రకారం, హిందూమాసంలోని భాద్రపద మాసం అనగా ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో వచ్చే వినాయక చవితిని కూడా వినాయకుడి పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. చాలామందికి ఈ వినాయక చవితి గురించే ఎక్కువగా తెలుసు, అయితే మాఘమాసంలో జరిపే వినాయక జయంతి చాలా తక్కువ మందికి తెలుసు. వినాయక జయంతిని మహారాష్ట్ర, గోవా, కొంకణ్ ప్రాంతాలలోని హిందువులు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగను ఉత్తరప్రదేశ్‌లో తిలో చౌత్ లేదా సకత్ చౌతీస్ అని కూడా పిలుస్తారు. 2024లో వినాయక జయంతి ఫిబ్రవరి13న వస్తుంది.

వినాయక జయంతి విశిష్టత

మాఘమాస శుక్లపక్ష చతుర్థిని వినాయకుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఈరోజు జ్ఞానాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున, పసుపు లేదా సింధూరంతో లేదా కొన్నిసార్లు ఆవుపేడతో శంఖాకార రూపంలో వినాయకుడి ప్రతిమను తయారు చేసి పూజిస్తారు. నువ్వులతో తయారు చేసిన ప్రత్యేక వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఆచారాలలో భాగంగా పగటిపూట ఆరాధన సమయంలో ఉపవాసం, రాత్రి విందు ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసంతో పాటు, వినాయకుడి కోసం పూజా ఆచారాలను పాటించే ముందు, భక్తులు తమ శరీరంపై నువ్వులతో తయారు చేసిన మిశ్రమాన్ని రాసుకొని, నువ్వుల విత్తనాలు కలిపిన నీటితో స్నానం చేస్తారు. వినాయక చవితి లాగే ఈరోజు కూడా చంద్రుడిని చూడడం నిషేధం. ఈ పండుగ తర్వాత నాల్గవ రోజు వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు.

పురాణ గ్రంథాల ప్రకారం, పరమ శివుడు తాను ఒక బిడ్డకు తండ్రి కావాలని ఏనాడు కోరుకోలేదు, అయితే బ్రహ్మాండంలోని అన్ని జీవులు భగవంతుడిని గ్రహించడంలో సహాయపడటానికి, సృష్టి కొనసాగడానికి ఒక బిడ్డ అవసరం అని ఆది పరాశక్తి పార్వతీదేవి భావిస్తుంది. ఇందుకోసం శక్తి తనకు తానుగా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె శరీరానికి పసుపు , నూనెతో అభిషేకం చేసుకుంటుంది. ఈ మిశ్రమం ఆరిపోయాక, శక్తి ఆమె శరీరం నుండి బయటకు తీసి, పిండి ముద్దగా చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి ప్రాణం పోస్తుంది. ఆ శిశువుకి వినాయక అనే పేరును పెడుతుంది. ఇక్కడ వి అంటే లేకుండా, నాయక అంటే నాయకుడు లేదా ప్రభువు అని అర్థం. అంటే తన ప్రభువు సాంగత్యం లేకుండానే శిశువుకి జన్మను ప్రసాదించింది కావున వినాయకుడు అయ్యాడు అని అర్థం. ఇలా వినాయక జననం మాఘమాస శుక్ల చతుర్థి నాడు జరిగింది కాబట్టి ఈరోజును వినాయక జయంతిగా పాటిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని వినాయక ప్రతిమను పసుపు- నూనె కలిపిన మిశ్రమంతో తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

వినాయక జయంతి రోజును కుటుంబంలో కొడుకులు కలిగిన వారు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఎవరైనా కొడుకును సంతానం కోరుకునేవారికి ఈరోజు వినాయకుడ్ని భక్తితో పూజలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వినాయక జయంతి రోజున ఉపవాసం, పూజలు చేసిన వారికి సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయని నమ్మకం ఉంది.