Surya Grahan: హిందూ మతవిశ్వాసం ప్రకారం సూర్యగ్రహణం మంచి రోజు కాదు. సూర్యదేవతపై రాహు కేతువుల గ్రహణం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం పై గ్రహణ ప్రభావం ఉంటుందని చెప్తారు.
హిందూ మత విశ్వాసం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకూడదు. ఒకవేళ బయటకు వెళితే తల్లి చర్మంపై గ్రహణ ప్రభావం ఉంటుందని అదే సమయంలో కడుపులోని బిడ్డపై కూడా సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన కిరణాలు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సూర్యగ్రహణం రోజున భూమిపై పడే నీడకు గర్భిణీలు దూరంగా ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఇక సూర్యగ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీ స్త్రీలు వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది. గ్రహణం నుంచి సంభవించే అన్ని అనర్థాలు స్నానం చేస్తే పోతాయని చెబుతున్నారు.
గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం ఎంతమాత్రం మంచిదికాదట. అయితే గర్భిణీలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. అలా అని ఏదీ తినకుంటే అది తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు అంటే కత్తి, బ్లేడ్, కత్తెర, పిన్స్, సూదులు లాంటివి వినియోగిస్తే అది కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇక గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూసే ప్రయత్నం ఎంతమాత్రం చేయొద్దని సూచిస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గ్రహణ సమయంలో గర్భిణీలు శివ మంత్రాన్ని జపించడం ఉత్తమం. లేదా ఇష్టదైవానికి పూజలు చేస్తే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు.